ఒక నాయకుడుగానీ, నాయకురాలుగానీ తామున్న పార్టీ నుంచి బయటకు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు పదవులు దక్కలేదనే కోపంతో బయటకు వస్తారు. కొందరు అంతర్గత కొట్లాటల కారణంగా పార్టీ మారతారు, కొంతమంది మంచి అవకాశం రాగానే వేరే పార్టీలో చేరతారు. ఇలా ఏదో ఒక స్పష్టమైన కారణం ఉంటుంది. కానీ వైఎస్సార్ టీపీ నాయకురాలు ఇందిరా శోభన్ ను ప్రజలు ఆ పార్టీలో ఉండొద్దు …బయటకొచ్చేయ్ అన్నారట. ప్రజల కోరిక మేరకే తాను రాజీనామా చేశానని చెప్పింది ఇందిరా శోభన్.
గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసింది. ఆ పార్టీలో అంతో ఇంతో పాపులర్ మహిళ. ఇదివరకు టీవీ చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇందిరా శోభన్ అంటే గుర్తించగలిగే స్థాయిలో ఉండేది. షర్మిల పార్టీ పెట్టగానే అందులో చేరిపోయింది. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు రాలేదని అనుకొని ఉండాలి. మరో కారణం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి ఇందులో కొనసాగితే భవిష్యత్తు ఉండదని అనుకొని ఉండాలి. అందుకే షర్మిల పార్టీలోకి వెళ్ళిపోయింది. అందులో కీలకంగా మారింది. షర్మిలకు కుడిభుజంలా పనిచేసింది.
కానీ ఏడాది కూడా కాకముందే పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ఇదివరకే ఒకళ్ళో, ఇద్దరో నాయకులు షర్మిల పార్టీ నుంచి వెళ్లిపోయారు. పొయ్యేవాళ్ళు పోతున్నారు గానీ పార్టీలో చేరేవారు ఎవరూ లేరు. యాక్టివ్ గా ఉండే ఇందిరా శోభన్ వెళ్లిపోవడం షర్మిలకు దెబ్బే. ఇందిరా శోభన్ షర్మిలకు పంపిన రాజీనామా లేఖలో చెప్పిన కారణం విచిత్రంగా ఉంది. షర్మిల పార్టీ నుంచి బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారు కాబట్టి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పింది.
“షర్మిల వైఎస్‌ఆర్ టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణ పడి ఉంటాను. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను.” అని ఇందిరా శోభ పేర్కొన్నది. కానీ ఇది సరైన కారణం కాదనిపిస్తోంది. మరేదో కారణం ఉంది. ఎక్కువమంది అనుకుంటున్నది ఏమిటంటే … రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాక పార్టీ మంచి జోష్ మీద ఉంది. చురుగ్గా వ్యవహరిస్తోంది.
రేవంత్ రెడ్డి దూకుడు గులాబీ పార్టీలోనూ అంతో ఇంతో భయం కలిగిస్తోంది. దీంతో మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే బాగుంటుందని ఇందిరా శోభన్ అనుకొని ఉండొచ్చు. అందులోనూ ఇతర పార్టీల్లో చేరిన కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాడన్నమాట. ఇందిరా శోభన్ ను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఉండొచ్చు.
షర్మిల, ఇందిరా శోభన్ కలిసి పనిచేయడం కూడా అసాధ్యమని త్వరగానే తేలిపోయింది. ఏదో ఒక రోజు ఇదే జరుగుతుందని మొదటి నుంచే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఊహించినదానికంటే ముందే ఆరోజు వచ్చేసింది. ఇందిరా శోభన్ వైఎస్సార్‌టీపీని ఎందుకు వదిలేసినట్టు? అసలేం జరిగి ఉంటుంది?తెలంగాణలోని మహిళా రాజకీయ నాయకుల్లోని మంచి వక్తల్లో ఇందిరాశోభన్ ఒకరు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మంచి మైలేజ్ సంపాదించుకుంది. అయితే షర్మిల పార్టీలో పెద్ద నేతలెవరూ పెద్దగా లేకపోయినా.. కనీసం కాంగ్రెస్‌లో దక్కిన గౌరవం కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో దక్కడం లేదన్న అసంతృప్తి ఇందిరా శోభన్ లో ఉందని తెలుస్తోంది. షర్మిల ఒంటెత్తు పోకడ కారణంగా ఇద్దరి మధ్య పొసగడం లేదన్న మాటలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
మరోవైపు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఇందిరా శోభన్.. తన సామాజికవర్గం వారితోనే పార్టీని నింపేస్తున్నారని, వైఎస్ అభిమానులను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు షర్మిల దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అలాగే మహిళా కార్యకర్తలనూ ఇందిరా శోభన్ విస్మరిస్తున్నారని పలువురు షర్మిల దగ్గర వాపోయినట్టుగా ఆ మధ్య గుసగుసలు వినిపించాయి.
ఈ క్రమంలో ఇందిరాశోభన్‌కు ఇచ్చిన అధికారాల్లో షర్మిల కోత పెట్టారని .. దీంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణలో కోలుకునే అవకాశం లేదని అనిపించడంతో అప్పట్లో ఆమె పార్టీ వీడారు. కానీ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో సీన్ మారిపోయింది. ఒకరకగా తనది రాంగ్ స్టెప్ అని ఆమె భావించారని తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్‌కు కూడా బలమైన మహిళా గొంతు అవసరం ఉందని.. తిరిగి పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి కోరడంతో సొంత గూటికి వెళ్లాలని అనుకుంటున్నారని సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.