విశాఖ జనం మీద తమ ఇష్టం వచ్చినట్లుగా భాష్యాలు చెబుతున్న టీడీపీ వారికి మంత్రి గుడివాడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ రాజధాని వద్దు అని జనాలు అంటున్నారని చెప్పడమేంటని మండిపడ్డారు. ఒక విధంగా ఇది విశాఖ సహా ఉత్తరాంధ్రాను అవమానించడమే అని మంత్రి పేర్కొన్నారు.
విశాఖ రాజధాని విషయంలో టీడీపీ విమర్శలు చేయడాని ఆయన తప్పుపట్టారు. విశాఖలో ఈ నెల 15న భారీ ర్యాలీ జరుగుతుందని, ఆ ర్యాలీ చూస్తే విశాఖ జనుల మనో వాంచ ఏంటి అన్నది తెలుస్తుంది అని గుడివాడ చెప్పారు. ఉత్తరాంధ్రాలోని రైతులు, వ్యాపారులు, మేధావులు ప్రజా సంఘాలు అందరూ కూడా విశాఖ రాజధాని ద్వారా తమ ప్రాంతం బాగుపడాలని కోరుకుంటున్నారని గుడివాడ అన్నారు.
అలాంటిది విశాఖకు రాజధానే అక్కరలేదు అని చెబుతూ ఈ ప్రాంత మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండాలని పెయిడ్ ఆర్టిస్టుల చేత పాదయాత్ర చేయిస్తున్నారు అని ఆయన విమర్శించారు.
ఇప్పటికైనా పాదయాత్రను విరమించుకోవాలని గుడివాడ కోరడం విశేషం.