కోర్టు తీర్పుల విషయంలో ఆత్మపరిశీలన అవ‌స‌రం

ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కోర్టుల ముందు నిలవడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రభుత్వం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. Advertisement ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు…. పార్టీ వేరు ప్రభుత్వం వేరు.…

ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కోర్టుల ముందు నిలవడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రభుత్వం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు….

పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ప్రభుత్వ కార్యక్రమాలలో పార్టీ రాజకీయాలను చొప్పించడం చట్టవ్యతిరేకమైన చర్య. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉన్నది. అంత మాత్రాన అది చట్టం అవదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు , ధర్మపోరాట దీక్షలు అందులో రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చట్టవ్యతిరేకమైన చర్యే. కానీ ఆనాడు ఇదే అంశంపై కోర్టుకు విజ్ఞప్తి చేసి ఉంటే ఇలాంటి తీర్పే వచ్చిఉండేది. గతంలో చేయలేదా అని మేమూ చేస్తాము అంటే అది చెల్లదు. ఇది తెలిసి కూడా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రభుత్వం చేసిన తప్పిదం.

నిమ్మగడ్డ వ్యవహారం….

ఎన్నికల అధికారి నియామక నిబంధనలు మార్పు చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్నారు. తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. గమనంలో ఉండాల్సింది ఎన్నికల మధ్యలో కీలక అధికారి సర్వీసుపై ప్రభావం చూపే నిర్ణయం అందులోనూ ఇరువురు సుప్రీం వరకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపద్యంలో ఇలాంటి నిర్ణయం కోర్టు ముందు నిలువదు తెలిసి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయడం కోరి సమస్యను తెచ్చుకోవడమే.

ఆంగ్లభాష….

ఆధునిక యుగంలో ఆంగ్లభాష అవసరాన్ని కాదనలేము. కానీ ప్రపంచం అంగీకరించినది ప్రాథమిక విద్య మాతృభాషలొనే ఉండాలని రాజ్యాంగం కూడా అదే చెపుతుంది. ప్రభుత్వం తమ సారధ్యంలో నడిచే పాఠశాలలో ప్రాథమిక విద్య ఆంగ్లభాషలో అన్న జీఓ తీసుకువచ్చింది దాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం పేదలకు ఆంగ్లభాషలో బోధన చేయాలి అనుకుంటే ఇంగ్లీషు మీడియం పెట్టవచ్చు. ప్రజలు తమ పిల్లలను తమకు నచ్చిన మీడియంలో చేర్చుతారు. ఇంత చిన్న విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకుని వెళ్లారు. 98 శాతం ప్రజలు కోరుతున్నారు అని కోర్టుకు చెప్పినారు. ఇలాంటి ప్రయత్నాలు పలించకపోగా మరింతగా సమస్యలు తెచ్చుకోవడమే.

రాజధాని వ్యవహారం..

మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. హైకోర్టు తరలింపు మినహా మిగిలిన సచివాలయం , కార్యాలయాల తరలింపు జీఓల ద్వారా జరిగిపోతుంది. అలాంటిది బిల్లులు రూపంలో తీసుకొచ్చారు. రాజధాని ఒప్పందంలో భాగస్వామ్యంగా ఉన్న రైతులు కోర్టును ఆశ్రయించారు. నాడు ప్రభుత్వం కోర్టుకు చెప్పింది ఈ అంశం చట్టసభల పరిశీలనలో ఉందని. సహజంగా ఈదశలో కోర్టు జోక్యం చేసుకోదు. చట్టసభలో నిర్ణయం జరగకుండా , కోర్టు పరిధిలో వ్యవహారం ఉన్నప్పటికీ కర్నూలుకు కొన్ని కార్యాలయాలను తరలిస్తూ జీఓలు ఇచ్చినారు. సహజంగానే కోర్టు ప్రభుత్వ జీఓను కొట్టి వేసింది. కోర్టు తీర్పు కార్యాలయాల తరలింపుకు వ్యతిరేకం అనేదాని కన్నా ప్రభుత్వ నిర్ణయం చట్టపరిదిలో జరగలేదు అనడం సముచితంగా ఉంటుంది.

స్థూలంగా కోర్టులలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడాన్ని ప్రభుత్వం ఇతరుల మీద నెపం నెట్టడం , లేదా తాము  ప్రజాప్రయోజనాల కోసం చేస్తున్న నిర్ణయాలు కోర్టులు ముందు నిలవడం లేదు అని బాధ పడటం కన్నా తాము చేస్తున్న నిర్ణయాలలో చట్ట పరిధిలో ఎందుకు లేవో ఆత్మావలోకం చేసుకోవడం ఒక్కటే పరిష్కారం.

-మాకిరెడ్డి పురుషోత్త‌మ్ రెడ్డి