జ‌గ‌న్‌పై ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై హిందూపురం వైసీపీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చౌళూరు రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌కు పాల్ప‌డిన నిందితుల‌కు ప‌రోక్షంగా ప్ర‌భుత్వం అండ‌దండ‌గా నిల‌వ‌డ‌మే ఆగ్ర‌హానికి కార‌ణం. శ్రీ‌స‌త్య‌సాయి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై హిందూపురం వైసీపీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చౌళూరు రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌కు పాల్ప‌డిన నిందితుల‌కు ప‌రోక్షంగా ప్ర‌భుత్వం అండ‌దండ‌గా నిల‌వ‌డ‌మే ఆగ్ర‌హానికి కార‌ణం. శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. ప్ర‌స్తుతం అక్క‌డ నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలే రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌కు దారి తీశాయి.

వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌టికొచ్చి సొంతంగా వైఎస్సార్‌సీపీ పేరుతో పార్టీ పెట్టుకున్న‌ప్పుడు, హిందూపురంలో మొట్ట‌మొద‌ట ఆయ‌న వెంట న‌డిచిన నాయ‌కుడే రామ‌కృష్ణారెడ్డి. ఈయ‌న కెనడాలో ఎంబీఏ చ‌దువుకున్నారు. ఈయ‌న కుటుంబానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. రాజ‌కీయంగా బ‌ల‌మైన నేప‌థ్యం ఉంది. రామ‌కృష్ణారెడ్డి అబ్బ (నాయ‌న తండ్రి) 1962లో హిందూపురం నుంచి కాంగ్రెస్ ప్ర‌ముఖ నాయ‌కుడు క‌ల్లూరు సుబ్బారావుపై స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిలిచి గెలుపొందారు. ఆయ‌న పేరు కూడా రామ‌కృష్ణారెడ్డే.

విదేశాల్లో చ‌దువుకున్న చౌళూరు రామ‌కృష్ణారెడ్డి వైఎస్సార్ కుటుంబంపై అభిమానంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వైఎస్ జ‌గ‌న్ త‌ర‌పున హిందూపురంలో ఇంటింటికి తిరిగి పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. హిందూపురం వైసీపీ మొట్ట‌మొద‌టి స‌మ‌న్వ‌య క‌ర్త‌గా రామ‌కృష్ణారెడ్డిని జ‌గ‌న్ నియ‌మించారు. జ‌గ‌న్ చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో వున్న‌ప్పుడు లేపాక్షి నుంచి జైలు వ‌ర‌కూ రామ‌కృష్ణారెడ్డి నేతృత్వంలో పాద‌యాత్ర చేశారు. అయితే హిందూపురంలో కుల స‌మీక‌ర‌ణ పేరుతో రామ‌కృష్ణారెడ్డికి రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.

అయిన‌ప్ప‌టికీ వైఎస్సార్ కుటుంబంపై అభిమానంతో జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న హ‌త్య హిందూపురంలో వైసీపీ శ్రేణుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. త‌న కుమారుడిని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ హ‌త్య చేయించార‌ని రామ‌కృష్ణారెడ్డి త‌ల్లి నారాయ‌ణ‌మ్మ ఆరోపించారు. అలాగే ఎమ్మెల్సీ అనుచ‌రులు గోపీకృష్ణ‌, మాజీ ఎంపీపీ నంజుండ‌రెడ్డి, కార్మిక నాయ‌కుడు ర‌వికుమార్‌, నాగ‌న్న‌, వ‌రుణ హ‌త్య చేశార‌ని ఆమె ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. హిందూపురంలో రామ‌కృష్ణారెడ్డి లాంటి వాళ్ల‌ను కూడా కాపాడుకోక‌పోతే అధికార పార్టీలో వుండ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పార్టీ కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టార‌ని, ఎంతో సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తిని పొట్ట‌న పెట్టుకున్నా, క‌నీసం ఖండించే దిక్కులేద‌ని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. రామ‌కృష్ణారెడ్డి త‌ల్లి ఆరోపిస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాలే నిందితుల‌ను వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని డీజీపీ, ఎస్పీల‌ను కోర‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కంటే దారుణం మ‌రొక‌టి వుంటుందా? అని వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

కేవ‌లం ఎన్నిక‌ల కోసం వ‌చ్చిన ఇక్బాల్ లాంటి వాళ్లు, పార్టీకి మొద‌టి నుంచి వ‌చ్చిన వాళ్ల ఎలిమినేష‌న్‌కు శ్రీ‌కారం చుట్టార‌ని వైసీపీ శ్రేణులు ధ్వ‌జ‌మెత్తుతున్నాయి. ఇదే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని న‌మ్ముకుని వుంటే… ఇలా జ‌రిగేది కాద‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రామ‌కృష్ణారెడ్డి హ‌త్య‌పై వైసీపీ పెద్ద‌లెవ‌రూ క‌నీస సానుభూతి కూడా వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న‌త విద్య అభ్య‌సించి, ల‌గ్జ‌రీగా బ‌త‌కాల్సిన రామ‌కృష్ణారెడ్డి జీవితం విషాదాంతం కావ‌డం పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌ల‌చివేస్తోంది.