ఎన్ని ఏడుపులు వెల్లువెత్తుతాయో…?

బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ… జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఇప్పటికే లీజుకు ఇచ్చిన భూముల్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు పదేళ్లకు పైబడి పనులు మొదలు…

బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ… జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఇప్పటికే లీజుకు ఇచ్చిన భూముల్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు పదేళ్లకు పైబడి పనులు మొదలు పెట్టకుండా, స్థలం అప్పగించిన నాటినుంచి లీజు కూడా చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు పరిహారం కూడా కోరుతామంటూ ప్రభుత్వం ఒప్పందం రద్దు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికమీద.. మరో కొత్త విలాపాలకు రంగం సిద్ధం అయింది. ప్రభుత్వంలోని పెద్దలతో లాలూచీ ఒప్పందాలు చేసుకుంటే చాలు… ఒప్పందంలోని పనులు చేపట్టకుండా ఎన్ని నాటకాలు ఆడినా.. ఏమీ ఇబ్బంది ఎదురవదు… అడిగే దిక్కుండదు.. అన్నట్లుగా చెలరేగిన నవయుగ సంస్థకు ఇది షాక్. నవయుకు సంస్థతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటూ… వారు ఇష్టారాజ్యంగా చెలరేగడానికి సహకరించిన గత ప్రభుత్వాల పెద్దలందరికీ కూడా ఇది షాక్. దాంతో ఇప్పుడు ఈ రద్దు నేపథ్యంలో ఎందరినుంచి ఎన్ని రకాల ఏడుపులు మొదలవుతాయో చూడాల్సి ఉంది.

బందరు పోర్టు నిర్మాణం అడుగు ముందుకు పడకుండా ఉండడంలో, తొలుత నిర్మాణం ఒప్పందం కుదుర్చుకున్న వారినుంచి తర్వాత లీడ్ ప్రమోటర్ గా రంగప్రవేశం చేసిన నవయుగ వరకు ఎవరూ పట్టించుకోకపోవడంలో.. 2010 తర్వాత పాలనలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రెండింటి పాత్రా ఉంది. 2008 ఏప్రిల్ లో బందరు పోర్టు నిర్మాణం కోసం ఒక కన్సార్టియంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏడాదిలోగా ఆర్థిక వనరుల సమీకరణ సబబే అని గడువిచ్చారు.

ఈలోగా సదరు కన్సార్టియంకు ఇబ్బందులు వచ్చాయి. కొందరు భాగస్వాములు బయటకు వెళ్లి, నవయుగ సంస్థ లీడ్ ప్రమోటర్ గా రంగప్రవేశం చేసింది. ఇలాంటి జాప్యాలన్నీ కలిపి.. 2010 జూన్ 7న రాయతీలు సవరించి తిరిగి ఒప్పందం చేసుకున్నారు. ఆ తేదీకి చాలాకాలం ముందే 412 ఎకరాలను వారికి అప్పగించడం పూర్తియనప్పటికీ, ఎలాంటి పనీ మొదలు కాలేదు, లీజ్ రుసుము చెల్లించలేదు, కనీసం లీజ్ డీడ్ పూర్తి చేసుకోవడానికి కూడా ముందుకు రాలేదు.

సవరించిన ఒప్పందం ప్రకారం.. 2010 జూన్ నుంచి 12 నెలల్లోగా నిధుల సమీకరణ చేసుకోవాలి. కాంట్రాక్టర్లు ఆ పనిచేయలేదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత 2014 ఆగస్టు 27న ప్రభుత్వానికి లేఖ రాశారు. గడువులు పొడిగించాలని కోరారు. 12 నెలల్లోగా నిధుల సమీకరణ పూర్తి కావాలని, తర్వాత 36 నెలల్లోగా నిర్మాణం జరగాలని.. 2015 సెప్టెంబరు 10న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ ఏడాది సెప్టెంబరు 10లోగా మొత్తం పోర్టు నిర్మాణం పూర్తి కావాలన్నమాట. ఇప్పటిదాకా అక్కడ జరిగిందేమీ లేదు.

ఇక్కడ ఓ సంగతి గమనించాలి. నవయుగ వారు 2014 లో అడిగినట్లు గడువులను పొడిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి పైగా సమయం తీసుకుంది. కేవలం గడువు పొడిగించే ఉత్తర్వు ఇవ్వడానికే ఏడాది సమయం కాగా.. వారు నిధుల సమీకరణ నిర్మాణానికి ఉన్నది నాలుగేళ్లు. ఈ ఏడాది పాటు ప్రభుత్వం వారితో బేరసారాలాడి, తాము సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతులు ఇచ్చినట్లు అనుమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. పైలాన్ తప్ప… పోర్టు నిర్మాణం రూపేణా అక్కడేమీ లేదు.

ఈ మొత్తం లంచాల వ్యవహారాన్ని గమనించి విసిగిపోయిన జగన్మోహన రెడ్డి సర్కారు ఏకంగా మొత్తం ఒప్పందాన్ని రద్దు చేసేసింది. స్థలం వెనక్కు తీసుకున్నారు. నష్టపరిహారం కూడా వసూలు చేస్తారు. పోలవరం కాంట్రాక్టు రద్దు చేశారంటూ పెద్దపెట్టున విలాపాలు ప్రారంభించిన తెలుగుదేశం నాయకులకు బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు మరో షాక్ అవుతుంది. ఈ వ్యవహారంలో వారు భారీగా లబ్ధి పొంది ఉంటే గనుక.. వారికి కాంట్రాక్టర్ల వైపునుంచి భారీగా ఒత్తిడి ఉంటుంది. వారితో పాటూ.. ఎందరు ఎన్ని రకాలుగా విలపిస్తారో, ఈ నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన రెడ్డిని విమర్శిస్తారో వేచి చూడాలి.