జగన్ నామినేటెడ్ పదవుల పంపిణీ పేరిట అతి పెద్ద జాతరకు తెర తీశారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు బాగానే దక్కాయి. ఇక వరసపెట్టి ఒక్కొక్కరు బాధ్యతలు స్వీకరించడంతో విశాఖ రాజకీయ కోలాహలం ఒక్కలా లేదు.
ఇక విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ గా అక్రమాని విజయనిర్మల ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. దానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు తో పాటు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో వైపు విశాఖ నగర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నార్త్ వైసీపీ ఇన్చార్జి కె కె రాజు నెడ్ క్యాప్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన చేత ప్రమాణం చేయించడానికి ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హౌసింగ్ మినిస్టర్ శ్రీరంగ రాజు రావడం విశేషం. ఇక్కడ కూడా మంత్రి అవంతితో పాటు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దాంతో ఎన్నికల ఫలితాల రోజు నాటి వాతావరణం విశాఖలో ఎటు చూసినా కనిపించింది.
ఇక వైసీపీలో గత కొన్ని రోజులుగా ఇలా ప్రమాణ స్వీకారాలు వరసబెట్టి జరుగుతూ ఉంటే పార్టీ నేతలు కూడా సంబరాలలో మునిగితేలుతున్నారు. లోకల్ బాడీస్ కి ఎన్నికలు అయి ప్రజా ప్రతినిధులుగా చాలా మంది రావడంతో పాటు నామినేటెడ్ పదవులు కూడా దక్కడంతో వైసీపీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. విపక్షాలు డీలా పడిన వేళ అధికార పక్షం మరింత దూకుడు చేయడమే అతి పెద్ద ట్విస్ట్.