దేశంలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రతి రోజూ భారీ ఎత్తునే జరుగుతున్నా.. అనుకున్న మేర, అవసరమైన మేర మాత్రం జరగడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ గురించి గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాలకూ ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలకూ పొంతన లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆసక్తిదాయకమైన ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి.
-కేంద్ర హోం శాఖ వెబ్ సైట్ లోని సమాచారం ప్రకారం.. దేశంలో 56 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ జరిగింది.
-అయితే దేశంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిన వారి సంఖ్య కేవలం 12 కోట్ల స్థాయిలో మాత్రమే ఉంది. ఇది దేశ జనాభాలో కేవలం 9 శాతం మాత్రమే!
-కేవలం తొమ్మిది శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిన నేపథ్యంలో.. అసలు లక్ష్యానికి ఇండియా చాలా సుదూరంలో ఉందని స్పష్టం అవుతోంది.
-ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ ను చేస్తామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆచరణలో ఇప్పటి వరకూ అది సాధ్యం కాలేదు!
-ఇప్పటి వరకూ ఒకే రోజు అత్యధికంగా 80 లక్షల డోసుల వ్యాక్సిన్ ను వేశారు. అది కేవలం ఒక్క రోజు మాత్రమే జరిగింది. ప్రస్తుతం రోజువారీగా మళ్లీ తక్కువ సంఖ్యలోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది.
-గత వారం పది రోజుల సగటును తీసుకుంటే.. రోజుకు 50 లక్షల స్థాయిలో వ్యాక్సినేషన్ డోసులు వేస్తున్నారు.
-ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకు కోటి డోసులు వేసినా.. ఈ ఏడాది చివరకు వయోజనులందరికీ పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యం కాదు.
-రోజుకు సగటున 50 లక్షల డోసులు ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి. ఇదే స్థాయిలో రానున్న రోజుల్లో కూడా వ్యాక్సినేషన్ జరిగితే, ఈ ఏడాది చివరకు 70శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉంది.
-అదే లెక్కన 90 కోట్ల మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ అందించడం అనేది బహుశా వచ్చే ఏడాది మార్చికి గానీ పూర్తి కాదు.