'వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలిచి, అధికారం చేపడుతుందని అంతా అనుకుంటుంటే.. ఇప్పుడు మీరు టీడీపీని వీడుతున్నారా..' అని ఒక పచ్చ చానల్ ప్రతినిధి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు లైవ్ లో! ఆ ప్రశ్నకు బుచ్చయ్య కుండబద్ధలు కొట్టినట్టుగా సమాధానం ఇవ్వలేదు కానీ, 'అధికారంలోకి వస్తే వాళ్లనే అనుభవించనీయండి బాబూ..' అన్నట్టుగా మాత్రం స్పందించారు!
తెలుగుదేశం పార్టీ తీరు బాగోలేదని బుచ్చయ్య బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ల మీదే బుచ్చయ్య స్పందిస్తున్నారు. పార్టీ కొంతమంది చేతుల్లో చిక్కుబడిపోయిందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ముందు గొట్టాలు పెడుతున్న టీడీపీ అనుకూల మీడియా, ఆయనకు అధికారాన్ని ఎరగా వేస్తోంది!
రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని అంతా అనుకుంటున్నారని.. దమ్మున్న చానల్ లో చర్చాకార్యక్రమంలో వారి యాంకర్ అన్నాడు. మరి ఎక్కడ అనుకుంటున్నారో, ఆయనకు ఎక్కడ వినిపిస్తోందో అనేది కూడా ఇక్కడ ఆసక్తిదాయకమైన ప్రశ్న!
ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఉన్న ఆదరణకూ, ప్రజాభిప్రాయానికి ఏకైక ప్రాతిపదిక కేవలం ఎన్నికలు మాత్రమే. మరి తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ప్రజలు అనుకున్నారా? లేక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అనుకున్నారా..? లేక రేపోమాపో జరగబోయే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రజలు అనుకుంటున్నారా? ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయితే.. ప్రజలు అనుకుంటారా? .. సార్వత్రిక ఎన్నికలు అయిపోయి రెండేళ్లు గడిచిన తర్వాత తిరుపతి ఉప ఎన్నిక జరిగితే.. టీడీపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రబలిందని, టీడీపీ అధికారంలోకి వచ్చేస్తోందంటూ..అప్పుడే టీడీపీ అనుకూల మీడియా బాకా ఊదుతూ ఉంది. అది కూడా టీడీపీని వీడతానంటున్న నేత వద్ద! ఆయనే ఉంటే… మరెవరితోనే పనెందుకు అన్నట్టుగా.. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తోందనే విశ్వాసమే ఉంటే, ఇలాంటి సమయంలో బుచ్చయ్య ఇలా ఎందుకు మీడియాకు ఎక్కేవారనే చిన్న లాజిక్ ను మరిచినట్టుగా ఉన్నారు!
గతంలో బుచ్చయ్య ఎప్పుడో చంద్రబాబును తిడితే తిట్టి ఉండొచ్చు. చంద్రబాబును తిట్టిన వారు, ఎన్టీఆర్ వెనుక నిలిచిన వారు కూడా ఆ తర్వాత చంద్రబాబుకే జై కొట్టారు. చంద్రబాబు వెన్నుపోటు సమయంలో.. ఎన్టీఆర్ వెంట నిలిచిన పరిటాల రవి, బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ లాంటి వాళ్లలో.. పరిటాల, బుచ్చయ్య ఆ తర్వాత చంద్రబాబుకే జై కొట్టారు.
దేవినేని మాత్రం చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పని చేసి, చంద్రబాబును తూర్పారబడుతూ వచ్చారు. ఆయన కూడా చరమాంకంలో చంద్రబాబు పంచనే చేరారు. మరి చంద్రబాబు నాయకత్వం సొంత కులంలో విశ్వాసాన్ని కలిగిస్తే.. వారెలా ఆయనకు జై కొడతారో, ఈ ఉదాహరణలు చెబుతాయి. మరి అలాంటి బుచ్చయ్య చౌదరికే పచ్చమీడియా చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేయడమే సిసలైన కామెడీ!