మీడియం రేంజ్ నటీనటుల్ని జీ గ్రూప్ భలే పట్టుకుంటోంది. రెమ్యూనరేషన్ విషయంలో అందుబాటులో ఉండడంతో పాటు తమ వెబ్ డ్రామాలకు స్టార్ పవర్ కూడా కలిసొస్తుండడంతో ఇదే ఫార్ములాను కొనసాగిస్తోంది. ఇప్పటికే అమల, శ్రీకాంత్, స్నేహా ఉల్లాల్, ప్రియదర్శి, మధుషాలినీ, అలీ రెజా లాంటి నటులతో ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు రాహుల్ రామకృష్ణను రంగంలోకి దించింది.
త్వరలోనే జీ5లో ''నెట్'' అనే ఒరిజినల్ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఈ వెబ్ మూవీ కోసం రాహుల్ రామకృష్ణను లీడ్ రోల్ గా సెలక్ట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే.. ఓ వెబ్ మూవీకి కావాల్సిన ''సరుకు'' అంతా ఈ సినిమాలో ఉందనే విషయం తెలుస్తూనే ఉంది. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇదే వెబ్ మూవీతో అవికా గౌర్ ను కూడా ఓటీటీకి పరిచయం చేస్తోంది జీ గ్రూప్.
అవికా గోర్ ఒక ఫ్లాట్ లో ఉంటుంది. దాని నిండా సీక్రెట్ కెమెరాలు. ఆమె ఏం చేస్తున్నదీ తన ఫోనులో రాహుల్ రామకృష్ణ చూస్తుంటాడు. ఆఖరికి బాత్రూమ్కు వెళ్లినా సరే! ఒకరోజు ఫోన్ చూస్తూ 'మీ ఇంట్లో ఉన్నాడు మీ ఇంట్లో ఉన్నోడు' అని అరుస్తాడు. టీజర్ లో ఇంతవరకు మాత్రమే చూపించారు. అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు? ఏమైంది? అనే అంశాలు ట్విస్ట్ అన్నమాట. అసలు రాహుల్ రామకృష్ణ ఎందుకు ఆ కెమెరాలు పెట్టాడనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.
సెప్టెంబర్ 10న ఈ వెబ్ మూవీ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఒరిజినల్స్ విషయానికొస్తే.. ప్రియదర్శి చేసిన లూజర్ తో జీ5కు ఓ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ సరైన కంటెంట్ పడలేదు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చేసిన 'నెట్'తో ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు మరోసారి క్రేజ్ వస్తుందేమో చూడాలి.