రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ నుంచి సాగనంపే కుట్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పాత్ర ఉందా? అంటే…ఉంది అనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. తన అన్న కూతురు ఆదిరెడ్డి భవానికి రాజమండ్రి సిటీ స్థానం ఇప్పించి, అక్కడి నుంచి గోరంట్లను రూరల్‌కు పంపి మొదటి దెబ్బ కొట్టారని బుచ్చయ్య చౌదరి అనుచరులు ఆరోపిస్తున్నారు. అధికారంతో సంబంధం లేకుండా టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చే మనస్తత్వం గోరంట్ల సొంతమని, అందుకే ఆయనంటే పార్టీలో వలసవాదులకు గిట్టదని పరోక్షంగా ఆదిరెడ్డి భవాని కుటుంబాన్ని బుచ్చయ్య చౌదరి అభిమానులు విమర్శిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని అచ్చెన్నాయుడు, ఆయన అన్న కుమారుడైన శ్రీకాకుళం లోక్‍సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన నాయుడు తప్పుదోవ పట్టించి.. నాలుగుసార్లు రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన బుచ్చయ్యను రాజమండ్రి రూరల్‌కు పంపించారని ఆరోపిస్తుండడం గమనార్హం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాడు తన పార్టీకి వచ్చిన మొదటి ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డి అప్పారావుకు కట్టబెట్టారని బుచ్చయ్య అభిమానులు గుర్తు చేస్తున్నారు.
అలాంటిది టీడీపీ అధికారంలోకి రాగానే, వైసీపీని మోసగించి చంద్రబాబు సమక్షంలో ఆదిరెడ్డి అప్పారావు 2016లో చేరారని బుచ్చయ్య చౌదరి అభిమానులు గుర్తు చేస్తున్నారు. అచ్చెన్నాయుడి అన్న ఎర్రన్నాయుడి కుమార్తె భవానికి అప్పారావు కుమారుడితో వివాహం జరిగిందనే సంగతిని బుచ్చయ్య చౌదరి అనుచరులు ప్రస్తావిస్తున్నారు. అధికారం కోసం ఎన్ని పార్టీలైనా మారే ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవానికి రాజమండ్రి సిటీ సీటు ఇచ్చేందుకు బుచ్చయ్య చౌదరిని అయిష్టంగా రూరల్‌కు పంపారని మండిపడుతున్నారు.
ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీలో ఒంటరి చేయడంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అచ్చెన్న, ఆయన అన్న కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన సోదరైన రాజమండ్రి ఎమ్మెల్యే భవాని కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలను బుచ్చయ్య చౌదరి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు దగ్గర అచ్చెన్న కుటుంబానికి ఉన్న పలుకు బడిని ఉపయోగించి, బుచ్చయ్య చౌదరి మాట చెల్లుబాటు కాకుండా చేశారనే ప్రచారం తూర్పుగోదావరి జిల్లా అంతటా వ్యాపించింది. ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య రాజీనామా ప్రచారంతో పార్టీలోని కొందరు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా అచ్చెన్నాయుడు, ఆయన అన్న కూతురైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నేరుగా బుచ్చయ్య చౌదరిని ఎందుకు కలవలేదనే ప్రశ్నలు ఆయన అనుచరుల నుంచి వస్తుండడం గమనార్హం. మొత్తానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర జరిగిందనేది వాస్తవం. కుట్రదారులెవరో బుచ్చయ్య నోరు తెరిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.