మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని స్పష్టం అవుతోంది. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించాలని అక్కడి టీడీపీ శ్రేణులు కోరుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా కనిపించడం లేదు.
చంద్రబాబు వద్దకు బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం క్యాడర్ అంతా వెళ్లింది. కోడెల వల్ల పార్టీకి నష్టమని ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలని, కోడెల కూతురు- కొడుకుకూ చెక్ చెప్పాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
అయితే చంద్రబాబు మాత్రం వారి వాదనను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోడెల వ్యతిరేక వర్గం నుంచి అసహనం వ్యక్తంఅవుతూ ఉంది. ఇలాంటి వారితో రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది. కోడెల కుటుంబాన్ని సత్తెనపల్లి టీడీపీ వ్యవహారాల నుంచి తప్పించి, రంగారావుకు బాధ్యతలు ఇవ్వాలని అసంతృప్తులు వాదిస్తున్నారట.
అయితే నియోజకవర్గంపై తనపట్టు కోల్పోకుండా ఉండేందుకు కోడెల కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని తెలుస్తోంది. కోడెల తన అనుచవర్గంతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.