చంద్రబాబు రాజకీయం చేయడానికి, అధికార పక్షంపై బురద జల్లడానికి ఓ పాయింట్ కావాలి. నిజంగా ప్రజల్లో అసంతృప్తి లేకపోయినా, రెచ్చగొట్టి మరీ వారితో ప్రదర్శనలు చేయించి, తన దగ్గరకు పిలిపించుకుని ఓదార్చి రెండునెలల కొత్త ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బాబు. అయితే ఇలాంటి నీచ రాజకీయాల్లో నుంచి ఓ పాయింట్ మిస్ అయింది. ఆశా వర్కర్ల జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సరికి టీడీపీ నేతలు షాక్ అయ్యారు.
జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో, ఆశా వర్కర్ల కళ్లలో ఆనందం కంటే ఎక్కువగా, టీడీపీ నేతల కళ్లలో నిరాశ కనిపించింది. ఇన్నాళ్లూ ఆశా వర్కర్లు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తుంటే.. టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. వారికి వంతపాడుతూ జగన్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. తమ హయాంలో జీతాలు పెంచకుండా కాలం నెట్టేసి, తీరా జగన్ వచ్చిన రెండు నెలల్లోనే వీరికి న్యాయం జరగలేదంటూ మొసలు కన్నీరు కార్చారు. ఆశా వర్కర్ల తరపున తాను పోరాటం చేస్తానంటూ కామెడీ చేశారు.
తీరా ఇప్పుడు జగన్ ఆశా వర్కర్ల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకునే సరికి టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. జగన్ మాటిస్తే మర్చిపోరు, కచ్చితంగా తన హామీలన్నీ నెరవేరుస్తారనడానికి ఇది మరో నిదర్శనం. అయితే పచ్చ ఉచ్చులో పడి, టీడీపీ రెచ్చగొట్టడం వల్లే ఆశా వర్కర్లు ఇన్నిరోజులూ నిరసనలకు దిగారు. ఈ నిరసనల వల్ల కాసేపు మీడియాకి పని దొరికింది, పోలీసులు అవస్థలు పడ్డారు.. అంతేకానీ ఇంకేమైనా జరిగిందా?
జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచారు కానీ, కొత్తగా నిరసనల వల్ల పెరిగిందేమీకాదు కదా. ఆశా వర్కర్లతో పాటు ఆందోళనలకు దిగుతున్న ఎంపీఈవోలు, గోపాల మిత్రలు.. మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు ఐదేళ్లలో అమలు చేయని హామీలు, జగన్ వచ్చిన 2 నెలలకే అమలు కావాలంటే ఎలా? పోనీ చంద్రబాబులాగా జగన్ ఐదేళ్లపాటు ఏమార్చే రకమా అంటే అదీకాదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలన్నీ పచ్చ బ్యాచ్ రెచ్చగొట్టి చేయిస్తున్నవే కావడం గమనార్హం.