జమ్మూకాశ్మీర్ విభజనతో పాకిస్తాన్‌కి చావుదెబ్బే తగిలింది. లేకపోతే, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసరంగా పార్లమెంటు సమావేశాల్ని నిర్వహించడం, ఈ క్రమంలో అక్కడ పాలక – ప్రతిపక్షాల మధ్య రచ్చ జరగడమేంటి.? అక్కడితో ఆగలేదు ఇమ్రాన్ ఖాన్, తమ దేశంలో ప్రభుత్వాన్ని శాసిస్తోన్న తీవ్రవాద సంస్థల్ని శాంతపరిచేందుకోసం అతి చెత్త నిర్ణయాల్ని అత్యంత వేగంగా తీసేసుకుంటున్నారు. పక్కనున్న చైనాతో కలిసి అంతర్జాతీయ కుట్రకు తెరలేపేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొద్దినెలల క్రితం జరిగిన పుల్వామా టెర్రర్ ఘటన, ఆ తర్వాత పాకిస్తాన్‌కి 'బాలాకోట్' ఎయిర్ స్ట్రైక్‌తో భారతదేశం బదులిచ్చిన విధానం.. ఇవన్నీ అందరికీ తెల్సిన విషయాలే. పాకిస్తాన్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు వెళ్ళినా, అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశం నుంచీ భారత్‌పై విమర్శలు రాలేదు. అంత పకడ్బందీగా వ్యూహరచన జరిగింది అప్టప్లో. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ విభజన విషయంలోనూ అంతకు మించిన స్థాయిలోనే పకడ్బందీ ప్రక్రియ నడిచినట్లు కన్పిస్తోంది.
ఎప్పుడైతే జమ్మూకాశ్మీర్ రెండుగా విడిపోయి, ఆ విడిపోయిన రెండుభాగాలు (జమ్మూకాశ్మీర్, లడఖ్) కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయో, అప్పుడే పాకిస్తాన్ సగం చచ్చిపోయింది. పాకిస్తాన్ చాలాకాలంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ అభివృద్ధి అనేమాటకు అర్థమేలేదు. తమ దేశ ప్రజల్ని మెప్పించాలంటే, కాశ్మీర్ పేరుతో భారత్‌ని బూచిగా చూపించాల్సిందే. కానీ, ఇకపై ఆ పరిస్థితి పాకిస్తాన్లో వుండకపోవచ్చు.
ప్రత్యేక రాష్ట్రంగా, ప్రత్యేక అధికారాలతో ఇప్పటిదాకా వున్న జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి అస్సలేమాత్రం నోచుకోలేదు. కాశ్మీర్ అంటే ప్రకృతి అందాల కంటే ఎక్కువగా అక్కడి తీవ్రవాదమే గుర్తుకొస్తుంది అందరికీ. ఇకపై పరిస్థితులు మారబోతున్నాయి. టూరిజం పరంగా కావొచ్చు, ఇతర రంగాల్లో కావొచ్చు.. కాశ్మీర్ అభివృద్ధి చెందితే, పాకిస్తాన్ కథ పూర్తిగా ముగిసిపోతుంది. అదే, ఆ భయంతోనే పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. కాశ్మీర్ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి లబ్దిపొందిన పాకిస్తాన్, ఇకనుంచి కాశ్మీర్‌పై తమకు 'పరోక్ష' పెత్తనం వుండదన్న భయం పాకిస్తాన్‌ని వెంటాడుతోంది.
ఇదిలావుంటే, చైనా దగ్గర మొసలి కన్నీరు కార్చుతున్న పాకిస్తాన్‌కి అక్కడా తగినంత మద్దతు కన్పిస్తున్నట్లు లేదు. అంతర్జాతీయ సమాజం నుంచి అనుకున్న స్థాయిలో కాశ్మీర్‌పై స్పందన రాకపోవడంతో ఈ వ్యవహారంపై చైనా ఆచి తూచి వ్యవహరిస్తోంది. కేవలం లడఖ్ విషయంలో మాత్రం స్పందించి ఊరుకుంది చైనా. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిస్తానంటోన్న పాకిస్తాన్‌కి అక్కడా చావుదెబ్బ తప్పకపోవచ్చు.