జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కొర‌వ‌డిన టీడీపీ మ‌ద్ద‌తు!

దేవునికైనా దెబ్బే గురువు అని పెద్దలు ఊరికే చెప్ప‌లేదు. ఈ నానుడి జేసీ బ్ర‌ద‌ర్స్‌తో స‌హా టీడీపీ నేత‌లంద‌రికీ స‌రిగ్గా వ‌ర్తిస్తుంది. హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి రెండో రోజు విచార‌ణ నిమిత్తం టీడీపీ సీనియ‌ర్…

దేవునికైనా దెబ్బే గురువు అని పెద్దలు ఊరికే చెప్ప‌లేదు. ఈ నానుడి జేసీ బ్ర‌ద‌ర్స్‌తో స‌హా టీడీపీ నేత‌లంద‌రికీ స‌రిగ్గా వ‌ర్తిస్తుంది. హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి రెండో రోజు విచార‌ణ నిమిత్తం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వెళ్లారు. ఈడీ కేసు న‌మోదు మొద‌లుకుని, విచార‌ణ వ‌ర‌కూ దారి తీసిన ప‌రిస్థితుల‌పై జేసీ బ్ర‌ద‌ర్స్‌తో పాటు చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌ర టీడీపీ నేత‌లెవ‌రూ నోరు విప్ప‌డం లేదు. జేసీ బ్ర‌ద‌ర్స్‌కు టీడీపీ మ‌ద్ద‌తు కొర‌వ‌డింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదే ఏపీ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని విచార‌ణ సంస్థ చేసి వుంటే ఇది క‌క్ష పూరిత చ‌ర్య అని, వైసీపీ ప్ర‌భుత్వం వేటాడుతోంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేసేవారు. త‌మ ప్ర‌భుత్వం రాగానే ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించేవాళ్లు. కానీ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని విచారిస్తున్న‌ది ఈడీ కావ‌డంతో టీడీపీ నేత‌లెవరూ నోరెత్త‌డం లేదు. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే విచార‌ణ సంస్థ కావ‌డంతో విమ‌ర్శించ‌డానికి టీడీపీ నేత‌ల‌కు ధైర్యం చాల‌డం లేదు.  

త‌మిళ‌నాడు, ఉత్త‌రాఖండ్‌లోని అశోక్‌లేలాండ్ కంపెనీ నుంచి వాహ‌నాల‌ను రెండు కంపెనీల‌కు తుక్కు కింద కొనుగోలు చేసి, వాటిని నాగాలాండ్‌లో బీఎస్‌-4 వాహ‌నాల కింద రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఆ త‌ర్వాత వాటిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ‌దిలీ చేయించార‌ని ర‌వాణాశాఖ అధికారులు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి త‌దిత‌రుల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో కొంత కాలం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి క‌డ‌ప జైల్లో కూడా ఉన్నారు.

పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేప‌థ్యంలో జేసీ సోద‌రుల నివాసాలతో పాటు వారి కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ఈడీ విచార‌ణ జ‌రుపుతోంది. ఈ ద‌ర్యాప్తు ఎంత వ‌ర‌కూ దారి తీస్తుందో తెలియాల్సి వుంది. ఈడీ ద‌ర్యాప్తుపై జేసీకి సొంత పార్టీ నేత‌లెవ‌రూ అండ‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డం స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.