ఇంకా ఆత్మవంచనేనా? అయితే కష్టమే!

ప్రజలు అవివేకులు కాదు. వాళ్లు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత.. పరాభవం దక్కిన వారికి అది చేదుగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా అర్థం చేసుకుని, మళ్లీ వాళ్ల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప..…

ప్రజలు అవివేకులు కాదు. వాళ్లు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత.. పరాభవం దక్కిన వారికి అది చేదుగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా అర్థం చేసుకుని, మళ్లీ వాళ్ల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప.. వారిని మూర్ఖులుగా అభివర్ణిస్తూ నిత్య ఆత్మవంచనతో చెలరేగితే ఏమవుతుంది? ఏం లాభం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అదే పనిచేస్తున్నారు.

2019 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించారు. రెండునెలల పాటూ పెయిడ్ కూలీల్ని పోగేసి.. తనను కౌగిలించుకుని ఏడ్చేలాగా వారికి ట్రైనింగ్ ఇచ్చి.. ‘అన్యాయం జరిగిందనే సానుభూతి’ని చంద్రబాబు మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే సేమ్ ఏడుపులు ఎంతోకాలం సాగవని ఆయనకు తెలుసు. ఈలోగా ఆయన తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో తన సర్వేగణాలతో సర్వే చేయించుకుని ఉంటే బాగుండేది. ఆ పని చేయలేదు. ఏకంగా ప్రజల వివేకాన్ని ప్రశ్నించేలా, వారిని మూర్ఖులుగా అభివర్ణించేలా మాట్లాడుతున్నారు.

‘చంద్రబాబు గారు పాలిచ్చే గోవు లాంటివారట.. జగన్ ప్రభుత్వం దున్నపోతు అట!’ ఎన్నికల వేళ ఆవేశ కావేషాలు రగిలి, ప్రజల్ని మాయ చేయడానికి, మాటలు తూలుతుండడం సహజం. ఫలితాలు వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా, నలభయ్యేళ్ల అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తకు ఇలాంటి దుడుకు మాటలు ఎందుకొస్తాయి? చూడబోతే చంద్రబాబు బ్యాలెన్స్ తప్పిపోతున్నారని అనిపిస్తోంది.

ఆయన చెబుతున్న మాటల్లో పట్టిసీమ ఒక్కటే ‘పూర్తయిన’ సంగతి. వైఎస్ రాజశేఖర రెడ్డి తవ్విన కాలువలన్నీ సిద్ధంగా ఉండగా, ఎత్తిపోతల మాత్రం బిగించి.. వందల కోట్లు దండుకున్నారనే ఆరోపణలుండగా.. ఆయన దాన్ని మమ అనిపించారు. నిర్దిష్టంగా ఈ అయిదేళ్ల కాలంలో.. చంద్రబాబు సర్కారు ప్రారంభించి- పూర్తిచేసిన పని ఒక్కటైనా ఉన్నదా?

‘‘అమరావతికి శ్రీకారం చుట్టా, పోలవరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నా…’’ అంటూ తన మాయలను, వైఫల్యాలను అన్నింటినీ బాబే స్వయంగా బయటపెట్టుకుంటున్నారు. ఈ మాటలను గమనించిన ఎవ్వరికైనా ఆయన ఒక్కటి కూడా పూర్తిచేయలేదు అనే అనిపిస్తుంది. ఎంతసేపూ కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలం, ఎల్ఈడీ తెరలమీద రాజధాని అందాలు చూపించడం తప్ప.. నిర్మాణాలుగా చేసినది నికృష్టమైన నాణ్యతతో ఉండే సెక్రటేరియేట్ ఒక్కటే. బాబు ఏలుబడిలోనే.. దాని నాసితనం బయటపడింది. అధికార్ల క్వార్టర్ల నిర్మాణాలు మాత్రం సాగుతున్నాయి.

రాజధాని కోసం ఇంకేం చేశారని చంద్రబాబు ఇవాళ ఆక్రోశంతో రంకెలు వేస్తున్నారో తెలియడంలేదు. ముందే చెప్పుకున్నట్టు ప్రజలు అవివేకులు కాదు. దున్నపోతును కోరుకున్నారంటూ వారిని నిందిస్తే, మూర్ఖులుగా పరిగణిస్తే.. ఎప్పటికీ తిరిగి వారి ఆదరణ పొందలేరు. రాజకీయమే మానుకోవాల్సిన రోజులొస్తాయని ఆయన గ్రహించాలి. 

అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ