ఆర్టికల్ 370 అనే అధికరణం రద్దు అయిన తర్వాత.. ఉదారవాదులు, వామపక్ష వాదులందరూ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. తతిమ్మా యావద్దేశం హర్షిస్తోంది. భాజపా ప్రభుత్వానికి ప్రజల దృష్టిలో బాగానే మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ బిల్లు గట్టెక్కడానికి సంబంధించిన సమస్త క్రెడిట్ ఓ పెద్దాయనకు మాత్రమే దక్కుతుందన్నట్లుగా తెలుగు అగ్ర పత్రికలు కథనాలు వండి వారుస్తున్నాయి. ఆయన సభా నిర్వహణ చాతుర్యం వల్లనే గానీ.. లేకపోతే.. ఎంతో వివాదాస్పదం అయిన ఈ బిల్లు గట్టెక్కేదేనా? సాధ్యమేనా? అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి.
వెంకయ్యనాయుడు రాజ్యసభ ఛైర్మన్ గా అపరిమితమైన నిర్వహణా చాతుర్యం ప్రదర్శించకపోయి ఉంటే గనుక.. అసలు ఈ బిల్లు సభ దాటి ఉండేదే కాదంటూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించారని… అందుకోసం పొద్దున్నే మోదీ ఆయన ఇంటికి వెళ్లి రిక్వెస్టు చేశారని, ఆయన సభా నియమాలూ గట్రా స్టడీ చేసి.. ఒక తరణోపాయం కనుక్కున్నారని తదనుగుణంగానే సాంతం నడిపించారని కథనాలు వస్తున్నాయి.
ఎలా జరిగిందనేది ముఖ్యంకాదు. ఆర్టికల్ 370 రద్దు అనేది జరగబట్టి ఇప్పుడు ప్రధానంగా నరేంద్రమోడీ, అమిత్ షాలనే అందరూ ప్రస్తుతిస్తున్నారు. వారిద్దరినీ సాహసులని అభివర్ణిస్తున్నారు. అయితే, వెంకయ్యనాయుడే గనుక లేకపోయినట్లయితే వారి ప్రయత్నం అసలు సఫలం అయ్యేదేనా? అని అర్థంవచ్చేలా పత్రికల్లో కథనాలు వస్తుండడం చిత్రం.
రాజ్యసభ ఛైర్మన్ హోదాలో, బిల్లును తొలుత రాజ్యసభలోనే ప్రవేశపెట్టిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు కొంత కీలకమే అయినమాట వాస్తవం. కానీ.. ఘనత అంతా ఆయనకే ఆపాదిస్తున్నట్లుగా కథనాలు వండి వార్చడం మాత్రం ఉద్దేశ్యపూరితాలే. ఇలాంటి వాటి వల్ల.. దేశ రాజకీయాల్లో ఒక శిఖరాయమానమైన స్థాయికి చేరుకున్న వెంకయ్య కీర్తికే మచ్చ.
పత్రికలు కొన్ని గతంలో కూడా ఇలాగే చేశాయి. హోదా పదేళ్లకు భాజపా అంగీకరించినప్పుడు, ఆ తర్వాత ప్రత్యేకప్యాకేజీ ప్రకటించినప్పుడు ఘనత మొత్తం వెంకయ్యకు ముడిపెట్టాయి. ఆ తర్వాతి కాలంలో ఆ రెండూ కూడా మూలనపడ్డాయి. దానివల్ల వెంకయ్యనాయుడు విపరీతంగా నిందలపాలు కావాల్సి వచ్చింది.