లోకేశ్ ట్రాప్‌లో వైసీపీ!

టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ ట్రాప్‌లో వైసీపీ నేత‌లు ప‌డ్డారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో అడ‌గ‌డుగునా ప్ర‌భుత్వ వైఫ‌ల్యం స్పష్టంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.…

టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ ట్రాప్‌లో వైసీపీ నేత‌లు ప‌డ్డారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో అడ‌గ‌డుగునా ప్ర‌భుత్వ వైఫ‌ల్యం స్పష్టంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ప్పుల్ని స‌రిదిద్దుకోడానికి బ‌దులు, మ‌రిన్ని త‌ప్పులు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ర‌మ్య హ‌త్య కేసు వ్య‌వ‌హారం కాస్తా…వైసీపీ వ‌ర్సెస్ లోకేశ్ అన్న‌ట్టుగా త‌యారైంది.

టీడీపీ కోరుకుంటున్న‌ది కూడా ఇదే. ప్ర‌త్య‌ర్థి ఆశిస్తున్న‌ట్టుగానే వైసీపీ ప్ర‌భుత్వం న‌డుచుకుంటోంది. ర‌మ్య మృత‌దేహాన్ని చూసేందుకు వెళ్లిన నారా లోకేశ్‌పై కేసు, అరెస్ట్‌, ఆయ‌న్ని పోలీసుస్టేష‌న్ల చుట్టూ తిప్ప‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ త‌ప్పున‌కు బీజం ప‌డింది. ఇక్క‌డే లోకేశ్ ట్రాప్‌లో వైసీపీ ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఎందుకంటే విద్యార్థిని మృత‌దేహాన్ని చూసి, బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి లోకేశ్ వెళ్లి వుంటే చ‌ర్చే లేదు. కానీ అన‌వ‌స‌రంగా లోకేశ్‌ను అరెస్ట్ చేయ‌డంతో ర‌మ్య కేసు మ‌లుపు తిరిగింది. టీడీపీకి మైలేజ్ వ‌చ్చేలా ప్ర‌భుత్వ అత్యుత్సాహం దోహదం చేసింద‌నే విమ‌ర్శ సొంత పార్టీ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. 

లోకేశ్‌పై వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు కొడాలి నాని, మేరుగ నాగా ర్జున‌, నందిగం సురేష్‌, తాజాగా మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌, మ‌ల్లాది విష్ణు…ఇలా మూకుమ్మ‌డి దాడి చేయడంతో చ‌ర్చ‌కు లోకేశ్ కేంద్ర బిందువ‌య్యారు.

ర‌మ్య హ‌త్య లోకేశ్‌కు రాజ‌కీయంగా ఊపిరి పోసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. లోకేశ్ త‌న పొలిటిక‌ల్ కెరీర్‌లో మొట్ట మొద‌టి అరెస్ట్‌కు ర‌మ్య మృత‌దేహం చూడ‌డ‌మే కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. గుంటూరు ఘ‌ట‌న ఇచ్చిన కిక్‌తో లోకేశ్ ఆ మ‌రుస‌టి రోజు క‌ర్నూలు వెళ్లి హంగామా సృష్టించారు. లోకేశ్‌కు వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు క‌ర్నూలు ప్ర‌జాప్ర‌తినిధులు నానా తిప్ప‌లు ప‌డ‌డం అంద‌రికీ తెలిసిందే.