అందం కన్నా.. తన హుషారైన తీరుతోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, దశాబ్దాలుగా సెలబ్రిటీగా చలామణి అవుతోంది శిల్పా షెట్టి. హీరోయిన్ గా వేషాలను ఆపేసి దశాబ్దంన్నర గడుస్తోంది. అయినా శిల్ప తన ఉనికిని చాటుకుంటూనే వచ్చింది. బిగ్ బ్రదర్ టీవీ షో తర్వాత శిల్ప దశ తిరిగింది. ఆ తర్వాత యోగా, డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించడం, ఐపీఎల్.. వీటి ద్వారా శిల్ప నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక తన స్టైల్ తో కూడా కెమెరాలను తన వైపుకు తిప్పుకుంటూ వచ్చింది.
శిల్ప ఎక్కడ కనిపించిన కెమెరాలు క్లిక్కుమనేవి. వాటికి అనుగుణంగా పోజులిచ్చేది. అంతే కాదు.. నవ్వుతూ, అందరినీ పలకరిస్తూ, కెమెరామెన్లతో కూడా జోకులు వేస్తూ.. సరదా సరదాగా కనిపించేది శిల్ప. ఇలా తను ఉన్న జోట ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని తీసుకువచ్చేది. అయితే.. ఇప్పుడు శిల్ప తీరులో స్పష్టమైన మార్పు!
ఆమె మళ్లీ తన పనుల్లో పడ్డట్టుగా ఉంది. తన భర్త పోర్న్ వ్యవహారంలో అరెస్టు అయిన తర్వాత శిల్ప కొన్నాళ్లు ఇల్లు దాటలేదు. అయితే ఆమెతో పని చేస్తున్న వారు మాత్రం.. ఆమెను మళ్లీ ఆహ్వానించినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షోకు మళ్లీ హాజరయ్యింది. అయితే ఇప్పుడు శిల్ప మునుపటిలా ఉత్సాహంగా లేదు. కెమెరామెన్లు కనిపిస్తే..తల వంచుకుని వెళ్లిపోయిందట. ఇది శిల్ప తీరులో స్పష్టమైన మార్పు.
పోర్న్ వ్యవహారంలో శిల్ప ప్రమేయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. ఆమెకు దాంతో సంబంధం ఉన్నట్టుగా వారు చెప్పలేదు. ఆమె అరెస్టు కూడా జరగలేదు, భర్తకు మాత్రం బెయిల్ కూడా దక్కడం లేదు. తనకు డైరెక్టుగా ప్రమేయం లేకపోయినా శిల్ప తల వంచుకు వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఉంది. ఇదే విషయం గురించి ఆమె రాజ్ కుంద్రాను కూడా నిలదీసినట్టుగా ఇది వరకూ వార్తలు వచ్చాయి.
పోర్న్ వీడియోల డిస్ట్రిబ్యూషన్ వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని? దాని వల్ల ఫ్యామిలీ రెప్యూటేషన్ మొత్తం దెబ్బతినడంపై కుంద్రాను శిల్ప నిలదీసినట్టుగా ఇది వరకే వార్తలు వచ్చాయి. విచారణలో భాగంగా కుంద్రాను పోలీసులు అతడి ఇంటికి తీసుకెళ్లగా, ఆ సమయంలో అక్కడే ఉండిన శిల్ప అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి.
కుంద్రా పని వల్ల శిల్పకు పర్సనల్ ఎండోర్స్ మెంట్ డీల్స్ కూడా పోయాయట. గృహిణి తరహాలో పలు బ్రాండ్లను శిల్ప ఎండోర్స్ చేస్తూ ఉంటారు. వాటిల్లో చిన్న పిల్లలు, మహిళల వినియోగాలున్నాయి. కుంద్రా అరెస్టు కాగానే.. శిల్పతో ఆ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయట వివిధ కంపెనీలు. ఇదంతా చూస్తుంటే.. చాలా మంది హీరోయిన్ల పాలిట వారి భర్తలే విలన్లు అయినట్టుగా శిల్ఫా షెట్టి పాలిట కూడా ఆమె భర్తే విలన్ అయ్యాడనే మాట వినిపిస్తోంది.