రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే అధికారికంగా నిర్ధారించింది. దీంతో టీడీపీలో గోరంట్ల ప్రస్థానానికి ముగింపు పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిష్క్రమణతో టీడీపీకి భారీ దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకొడుకులు చంద్ర బాబు, లోకేశ్ వ్యవహరించిన తీరే ఆయన్ను పొమ్మనకుండా పొగ పెట్టినట్టు అవుతోందనే అభిప్రాయాలు టీడీపీలో ఉన్నాయి.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని గోరంట్ల పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వీడడానికి ప్రధానంగా తనతోనూ, తన వాళ్లతోనూ చంద్రబాబు, లోకేశ్ అమర్యాదగా వ్యవహరించడమే కారణమని నేరుగా అధిష్టానానికే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబు, లోకేశ్‌లకు ఎందుకంత కసి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం ఓ ప్రముఖ చానల్‌లో పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య రసవత్తర చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నాడు గోరంట్ల గురించి ఉండవల్లి చేసిన ఘాటు కామెంట్స్ ఏంటో మరోసారి గుర్తు చేసుకుందాం.
“నిన్ను ఎప్పుడూ మంత్రి చేయడు. గతంలో నువ్వు తిట్టిన బూతులను చంద్రబాబు మరిచిపోడు. నువ్వు సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నది కూడా చంద్రబాబు మరిచిపోడు. నువ్వు ఏం చేశావో, లక్ష్మీపార్వతి పార్టీ తరపున నువ్వు పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన స్పీచ్‌లు అన్ని పేపర్ కటింగ్‌లు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గరున్నట్టే చంద్రబాబు మెదడులో ఉంటాయి. చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దు. చంద్రబాబుకు బుర్ర ఉంది. తూర్పుగోదావరిలో నీకంటే సీనియర్ ఎవరున్నారు? అయినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదంటే కారణం ఏంటి? నువ్వు తిట్టిన తిట్లన్నీ బాబు బుర్రలో ఉ్నాయి. నువ్విప్పుడు ఎంత గింజుకున్నా సరే…నీకేమీ ఇవ్వరు. ఏం ప్రయోజనం వుండదు” అని తేల్చి చెప్పారు. నాడు ఉండవల్లి చెప్పిందే నేడు నిజమైందనే చర్చ నడుస్తోంది.
1983లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొదటి సారి టీడీపీ తరపున రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1985లో, 1994లో, 1999లో అదే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 1989, 2004లో ఓడిపోయారు. 2014, 2019లో తిరిగి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారాయన. 1995లో టీడీపీ చీలిక సమయంలో ఎన్టీఆర్ వైపు గోరంట్ల బుచ్చయ్య నిలిచారు.
ఇదే చంద్రబాబు దృష్టిలో నేటికీ గోరంట్ల అంటే గిట్టకుండా చేస్తోంది. అప్పట్లో లక్ష్మీపార్వతి పార్టీ తరపున బుచ్చయ్య చౌదరి ఎంపీగా పోటీ చేసి చంద్రబాబునాయుడి వెన్నుపోటు రాజకీయాల్ని తూర్పార పట్టారు. బాబుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేరారు.
కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై గోరంట్ల అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ప్రధానంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని వారిలో ఐదుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని అప్పట్లోనే గోరంట్ల బహిరంగంగా విమర్శించారు. చంద్రబాబు తప్పుడు దారిలో నడుస్తున్నారని తిట్టిపోశారు. గోరంట్ల విమర్శించినట్టే చంద్రబాబు అధికారం పోగొట్టుకోవాల్సి వచ్చింది. 2019లో చివరికి చంద్రబాబు తనయుడు ఓడిపోయినా, గోరంట్ల మాత్రం నెగ్గి సత్తా చాటారు.
అయినప్పటికీ తానంటే కనీస విలువ ఇవ్వడం లేదనే ఆవేదన ఆయన్ను మానసికంగా కుంగదీస్తోంది. కనీసం తన ఫోన్‌కాల్స్‌ను చంద్రబాబు, లోకేశ్ రిసీవ్ చేసుకోకపోవడంపై ఆయన ఆగ్రహానికి గురయ్యారు. మరీ ముఖ్యంగా తన వాళ్లకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన రగిలిపోతున్నారు. ఇలాంటి అనేక సంఘటనలు ఆయన్ను పార్టీ వీడేలా చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
1995లో పార్టీ చీలిక సందర్భంలో తన వెంట గోరంట్ల నడవకపోవడం, అలాగే లక్ష్మీపార్వతి పార్టీ తరపున పోటీ చేసి తిట్టడాన్ని… ఉండవల్లి చెప్పినట్టు చంద్రబాబు బుర్రలో నిక్షిప్తమయ్యాయి. చంద్రబాబును గోరంట్ల తిట్లు, శాపనార్థాలు నీడలా వెంటాడుతున్నాయనే అభిప్రాయాలు టీడీపీలో బలంగా ఉన్నాయి. అందుకే తండ్రీకొడుకుల నుంచి గోరంట్లకు నిరాదరణ అని పార్టీలో బలంగా ఉంది. చివరికి పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు తలెత్తాయి.