విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ నటనతో పాటు ఆయన వ్యక్తిత్వానికి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. రాజకీయంగా ఆయన అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అవి మోడీ విధానాలకు తీవ్ర వ్యతిరేకమైనవి.
సాధారణంగా పాలకులకు వ్యతిరేకంగా టాలీవుడ్ నటీనటులెవరూ మాట్లాడ్డం మనకు తెలియదు. చిత్ర పరిశ్రమ తత్వానికి విరుద్ధంగా ప్రకాశ్‌రాజ్ మోడీ విధానాలను తూర్పారపడుతుండడం వల్లే ఆయనకు రాజకీయ గుర్తింపు కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తుండడం ఆసక్తి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వస్తే …ప్రకాశ్‌రాజ్ స్థానికేతర అంశంపై విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రకాశ్‌రాజ్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమాని అయిన జూనియర్ ఆర్టిస్ట్ పాదయాత్ర చేపట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరు ప్రాంతానికి చెందిన రంజిత్‌కుమార్ ప్రకాశ్‌రాజ్‌కు వీరాభిమాని. కోలమూరు నుంచి హైదరాబాద్‌కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఈ విషయం తెలిసి ప్రకాశ్‌రాజ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇంటికి తిరిగి వెళ్లాలని కోరారు.
‘రంజిత్ బంగారం.. నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండండి. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాను’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడం విశేషం.