విశ్వ‌రూప్‌ను పొగుడుతూ…జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ!

కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డంపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రోసారి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న మార్క్ అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌డం విశేషం. మంత్రి విశ్వ‌రూప్‌ను పొగుడుతూ, ఏపీ ప్ర‌భుత్వాన్ని తిడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్…

కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డంపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రోసారి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న మార్క్ అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌డం విశేషం. మంత్రి విశ్వ‌రూప్‌ను పొగుడుతూ, ఏపీ ప్ర‌భుత్వాన్ని తిడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒకింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

కోన‌సీమ ఉద్రిక్త‌త‌పై ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ మంత్రి విశ్వ‌రూప్ మంచి వ్య‌క్తి అని ప‌వ‌న్ అన‌డం విశేషం. రాజ‌కీయాల కోసం రెచ్చ‌గొట్టే మ‌న‌స్తత్వం విశ్వ‌రూప్‌ది కాద‌న్నారు. అయితే ప్ర‌భుత్వ కుట్ర‌కు మంత్రి విశ్వ‌రూప్ బాధితుడిగా మిగిలార‌ని సానుభూతి వ్య‌క్తం చేశారు.

ఇన్ని ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతుంటే మంత్రులు బ‌స్సు యాత్ర చేయ‌డం ఏంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. కోన‌సీమ ఘ‌ట‌న‌లో ఫైర్ ఇంజ‌న్లు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్నారు.

కోన‌సీమ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం రాజ‌కీయ కోణంలో చూస్తోంద‌ని విమ‌ర్శించారు. కోన‌సీమ ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌ను ఫ్ల‌స్‌, మైన‌స్ అంటూ ఏ రాజ‌కీయ పార్టీ చూడ‌కూడ‌ద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ కోన‌సీమ ఉద్రిక్త‌త‌ల‌పై సీఎం జ‌గ‌న్ నోరు మెద‌ప‌లేద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ఉన్నంత వ‌ర‌కూ పోల‌వ‌రం పూర్తి కాద‌ని తేల్చి చెప్పారు.

ప‌వ‌న్ చిట్‌చాట్‌లో వ్యూహాత్మ‌కంగా మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మంత్రి విశ్వ‌రూప్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ద్వారా కోన‌సీమ‌లో ద‌ళితుల ఆద‌ర‌ణ పొందాల‌నే ఎత్తుగ‌డ క‌నిపించింది. కోన‌సీమ ఉద్రిక్త‌త‌ల వెనుక ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ప్ర‌మేయం వుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో వారికి జ‌న‌సేనాని ఒత్తాసు ప‌లుకుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ప‌వ‌న్‌పై ద‌ళితులు ఆగ్ర‌హంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇంత వ‌ర‌కూ మంత్రి విశ్వ‌రూప్‌పై దాడిని ప‌వ‌న్ ఖండించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డాన్ని కూడా ప‌వ‌న్ స్వాగ‌తించ‌లేదు. అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డాన్ని ప‌రోక్షంగా త‌ప్పు ప‌ట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఇప్పుడు నీతులు చెబుతుండ‌డంపై ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. కోన‌సీమ‌లో ఉద్రిక్త‌త‌లు త‌గ్గిన త‌ర్వాత ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డం విశేషం.