తల్లిదండ్రులతో పాటు మీడియా, సమాజాన్ని ఓ యువతి మోసగించింది. తనపై అత్యాచారం జరిగిందంటూ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. గతంలో కూడా ఇలాగే ఓ యువతి తనపై ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆడిన నాటకం రక్తి కట్టలేదు. చివరికి సదరు యువతి బలవన్మరణం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువతి నాటి ఘటనను గుర్తు చేసేలా సరికొత్త డ్రామాకు తెరలేపిన వైనం విమర్శలకు దారి తీసింది.
హైదరాబాద్ నగరంలో దారి మళ్లించి తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని చేసిన ఫిర్యాదు ఫేక్ అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వివరాలేంటో తెలుసుకుందాం. హైదరాబాద్ సంతోష్‌నగర్ పరిధిలో నివసిస్తున్న యువతి (20) మైలార్‌దేవ్‌పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. అక్కడికి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం 2.30 గంట లకు ఆటో ఎక్కింది.
ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరిన యువతి సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది నిన్నటి ఎపిసోడ్.
సీన్ కట్ చేస్తే…పోలీసుల విచారణలో ఏం తేలిందంటే…
బాధితురాలి ఫిర్యాదు మేరకు సంతోష్ నగర్ పోలీసులు, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, అనుసంధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. సంతోష్ నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నళ్లనూ సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. ఆటో డ్రైవర్లనూ విచారించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గురువారం ఓ అంచనాకు వచ్చారు. ఇంటికి ఆలస్యంగా వచ్చిన యువతిని తల్లిదండ్రులు నిలదీయడంతోనే రేప్ డ్రామా ఆడినట్టు పోలీసుల విచారణలో ప్రాధమికంగా తేలింది. ఈ నెల 17న డ్యూటీ నుంచి రాత్రి 9.30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే రాత్రి 10.30 గంటలకు చేరింది. దీంతో ఆలస్యంగా ఎందు కొచ్చావని కూతురిని తల్లిదండ్రులు ప్రశ్నించారు.
ఆ క్షణంలో సదరు యువతి మనసులో కలిగిన ఆలోచనే రేప్. తనపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులకు ఆ యువతి చెప్పింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురితో పాటు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి ఆటో ఎక్కిన సమయం, ఆమె చెప్పే అంశాలకు పొంతన లేదని నిర్ధరణకు వచ్చారు. ఉద్దేశ పూర్వ కంగానే అందర్నీ తప్పుదోవ పట్టించిందని పోలీసులు భావిస్తున్నారు.
యువతిని పోలీసులు విచారిస్తున్నారు. నిజానిజాలను పోలీసులు ఈ రోజు బయటపెట్టే అవకాశాలున్నాయి. రేప్ డ్రామా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి మరోసారి అత్యాచారం వార్తలతో ఇటు మీడియా, పోలీసులు, సమాజాన్ని ఓ యువతి తప్పుదోవ పట్టించిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం కథనం ఒకటేనని, క్యారెక్టర్ మారిందని…గతం తాలూకు ఘటనను గుర్తు చేసుకుని జనం మండిపడుతున్నారు.