రాజకీయాలు, సినిమాలు ఈ రెండూ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే రంగాలు. ఈ రెండింటికీ ప్రజల విశేషమైన ఆదరణ కావాలి. ఇక ఈ రెండు రంగాల మధ్య ఉన్న సన్నని గీత కూడా ఎపుడో చెరిగిపోయింది. అటు వాళ్ళు ఇటు అవుతున్నారు. ఇటు వాళ్ళు అటు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయాల్లోకి వెళ్ళిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖానికి రంగు వేసుకోవాలని ఉబలాటపడుతున్నారు.
పూర్వాశ్రమంలో ఆయన టాలీవుడ్ లో కొన్ని సినిమాలు తీసిన నిర్మాతగా కూడా ఉన్నారు. ఇపుడు రాజకీయ బిజీలో కాస్తా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ఆయనలో ఉన్న కళాకారుడు కూడా ఇపుడు బయటకు వస్తున్నాడు. విశాఖలో పుట్టి మన్నెం దొరగా పేరు గడించి తెల్ల దొరలను ఎదిరించిన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద ద ఒక సినిమా తీస్తున్నారు.
విశాఖకు చెందిన వారే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించడానికి విశాఖ ఎంపీ ఎంవీవీ ఓకే అనేశారు. అల్లూరి మీద సినిమా కావడం, దేశభక్తి ప్రపూరితమైన కధాంశం కావడంతో తాను నటిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.
తొందరలోనే ఈ సినిమా షూటింగులో ఎంపీ పాల్గొంటారు. మొత్తానికి ఇప్పటి దాకా నిర్మాతగా, ఎంపీగా, వ్యాపారవేత్తగా ఉన్న ఎంపీ గారు నటుడిగా కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. దాంతో ఆయన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.