చంద్రబాబు సీరియస్‌గా వుంటారు కానీ, పొలిటికల్ కామెడీ చేయడంలో ఆయన్ని మించిన వారు లేరు. ఆగస్టు 15, విశాఖ బీచ్‌లో విజన్-2047 ఆవిష్కరించి వినోదాన్ని పంచారు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా బాగు చేసే విజన్ తనకుందని చెప్పారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అద్భుతాలు సాధించానని, మరో అవకాశం ఇస్తే రూపు రేఖలు మారుస్తానని బాబు చెబుతున్నారు.
నిజానికి ఆయన భ్రాంతిలో జీవిస్తున్నారు. తాను వుండటమే కాకుండా జనాల్ని కూడా భ్రాంతిలో వుంచడం ఆయన ప్రత్యేకత. భూమ్మీద వుండడం ఇష్టం వుండదు. ఆకాశంలో విహరించడం ఆయన హాబీ. అందుకే గాలి కబుర్లు చెబుతుంటారు. మొదట్లో జనం కూడా నమ్మారు. నమ్మించేలా ఆయన మీడియా పని చేసింది. అద్భుతమైన దార్శనికుడని, విజనరీ అని పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రతి రోజూ పేజీల కొద్దీ రాస్తూ వుంటే, అప్పట్లో పత్రికలు తప్ప వేరే దారి లేక అబద్ధాల్ని నిజం అనుకున్నారు.
వచ్చీరాగానే మద్య నిషేధం ఎత్తి వేస్తే , అప్పటి వరకు సారా ఉద్యమంలో పేజీల కొద్దీ రాసి సమాజ హితకారుల వలే ఫోజు కొట్టిన ఈనాడు ప్లేటు ఫిరాయించి బాబు “మందు” చూపుని ప్రశంసించింది. ఫిల్మ్ సిటీ హోటళ్లలో కూడా మద్యం సర్వ్ చేసి , తాగుబోతులకి చేసిన అపచారాన్ని కడిగేసుకున్నారు.
జన్మభూమి పేరుతో పిచ్చి మొక్కల్ని నరికినా, ఇంకుడు గుంతలంటూ కోట్లు తగలేసినా, ప్రపంచ మేధావిగా కీర్తించారు. అబద్ధాలు పదేపదే చెబితే నిజాలుగా చెలామణి అవుతాయి. జనం నమ్ముతారు. 99లో ఇదే జరిగింది. మళ్లీ గెలిచారు. దాంతో చంద్రబాబు అసలుసిసలైన ప్రపంచ బ్యాంక్ జీతగాడిగా మారాడు. చీమల్ని చంపి ఏనుగుని మేపే కార్పొరేట్ ఆటకి తెరతీశారు. అభివృద్ధికి నమూనాగా రాష్ట్రాన్ని మారుస్తామన్నారు. పేదరికానికి నమూనాగా మార్చారు. 2004లో దిగిపోయే నాటికి 77 శాతానికి పైగా పేదరికానికి దిగువున ఉన్నారు. మరి ఈయన విజన్ 2020 ఎందుకు పని చేయలేదు? ఎందుకంటే ఈయన దృష్టిలో పేదలు, రైతులు, చిన్న వ్యాపారులు మనుషులే కాదు. ఈయన మనుషులంతా బడా వ్యాపారులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు.
జార్జ్ మన్బోయిట్ (George monbiot) అప్పట్లో ఏం రాశారంటే ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఆర్థిక ప్రయోగానికి ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబుని ఓడించారు.
లండన్‌కి చెందిన జోస్ మౌజ్ (jos mooij) 36 పేజీల రీసెర్చ్ వ్యాసంలో (అక్టోబర్ 2003) ఏం రాశారంటే ప్రపంచ రుణ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ డార్లింగ్ స్టేట్‌గా మారింది.
రకరకాలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తొలి వ్యక్తి చంద్రబాబే. ఈయన సత్యవంతుడిగా విజన్ -2047 గురించి మాట్లాడుతున్నారు.
విజన్ -2020 డాక్యుమెంట్‌ని అమెరికా సంస్థకి చెందిన మెకెన్సీ తయారు చేశాడు. 99లో రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా జీవించాలో, తల రాతలు ఎలా వుండాలో అమెరికా వాడు నిర్ణయించాడు (రెండున్నర కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 50 కోట్లతో సమానం). బాబుకి మనలో మేధావులు వుంటారంటే నమ్మకం లేదు. ఎంతసేపూ సింగపూర్, మలేషియా, అమెరికా అంటూ వుంటారు. తెలుగు వాళ్లు ఎలా జీవిస్తారో తెలియని మెకెన్సీ తయారు చేస్తే దాన్ని మన నెత్తిన రుద్ది అదో అద్భుతమని ఊదరగొట్టారు.
ఈ డాక్యుమెంట్‌ని చూపించి ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం వెళ్లారు. మన దేశంలో ఈ రకంగా వెళ్లిన మొదటి రాష్ట్రం మనది. విజన్‌లోని అంశాలు వినడానికి బాగానే వుంటాయి.
1.పేదలు బాగుండాలంటే విద్యా, వైద్యం మెరుగుపడాలి
-బాబు హయాంలో విద్య పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేకపోవడం వల్ల పేదలు అనివార్యంగా అప్పులు చేసి పిల్లల్ని ప్రైవేట్‌లో చేర్పించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు పెట్టింది కూడా మన చంద్రబాబే.
2001లో దేశం మొత్తంమీద అక్షరాస్యత 65 శాతం వుంటే, మన రాష్ట్రంలో 61 శాతం మాత్రమే.
2. మోటివేషన్ లేని చిన్న వ్యాపారుల స్థానం పెద్ద కార్పొరేషన్లు రావాలి.
-సంపద సృష్టిస్తానని చెప్పే చంద్రబాబు హయాంలో 54 ప్రభుత్వ సంస్థల్ని పావులాకి, అర్ధణాకి అమ్మేశారు. అన్నీ తన వాళ్లకి లేదా బినామీలకి
3. ఉపాధి పెంపు, నిరుద్యోగ నిర్మూలన
-ఔట్సోర్సింగ్ పెట్టింది చంద్రబాబే. అరకొర జీతాలతో చాకిరీ చేయిస్తూ, యువతకి కొత్త ఉద్యోగాలే లేకుండా చేశాడు.
4. విద్యుత్ రంగాన్ని సంస్కరించాలి
-సంస్కరణల పేరుతో భారీగా విద్యుత్ చార్జీలు పెంచితే జనం ఉద్యమించారు. బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగితే ముగ్గురు చనిపోయారు.
5.ప్రభుత్వ విధానాల్లో రాజకీయాలు ఉండకూడదు
-అన్ని వ్యవస్థలు రాజకీయాలు నిండిపోవడం బాబుతోనే మొదలైంది. జన్మభూమి పేరుతో అన్ని కాంట్రాక్టులు తెలుగుదేశం వారికే. ఈ పనుల్లో 33 శాతం సొమ్ము కార్యకర్తలు తినేయవచ్చని స్వయంగా చంద్రబాబే వారితో చెప్పినట్టు జోస్ అనే మహిళా జర్నలిస్టు తన డాక్యుమెంట్లో చెప్పారు.
6. SMART ప్రభుత్వం
Simple Moral Accountable Responsive Transparent
ఈ లక్షణాలు ఏమీ లేని ప్రభుత్వాన్నే బాబు నడిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ సంస్థ నడపడానికి 60 లక్షల పౌండ్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు దాని విలువ 630 కోట్లు.
విజన్-2020 పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు విజన్ -2047 అంటున్నారు.
ప్రతిదాన్ని తనకి ఆపాదించుకోవడం చంద్రబాబు అలవాటు.
1. ఇండియాను గ్లోబల్ లీడర్‌గా మార్చి నంబర్ ఒన్ చేస్తానని 2047 విజన్‌లో చెప్పారు.
-దేశంతో ఈయనకేం పని? దానికి కేంద్ర ప్రభుత్వం వుంది. 14 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి, ఇప్పుడు దేశం గురించి మాట్లాడ్డం సబబా?
2. రోబోటిక్స్ , డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి గురించి బాబు చెప్పకపోయినా ప్రపంచానికి తెలుసు.
ఇది చెప్పడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కర్లేదు. పవర్ కోసం తిప్పలు తప్ప.
3. సోలార్ విద్యుత్, నీళ్లు, నదుల అనుసంధానం, టెక్నాలజీ ఇవన్నీ చెప్పడానికి బాబు డాక్యుమెంట్ ఎందుకు?
-ఐన్‌స్టీన్ సిద్ధాంతం బోధించే ఉపాధ్యాయుడు తానే ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టినట్టు చెబితే ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే.
4. డెమెక్రసీక్ మేనేజ్మెంట్ – మనదేశంలో పని చేసేవాళ్లు ఎక్కువ వున్నారట! వాళ్లంతా ప్రపంచానికి సేవలు అందించాలట.
అందరికీ పని వుంది – మీకు తప్ప, అందుకే ఈ పనికి మాలిన డాక్యుమెంట్.
5. రిచ్ టు పూర్ – ఇది చంద్రబాబుకు బాగా తెలుసు. రెండెకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకి ఎదిగారు.
వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన బాబు హయాంలోనే రెండు కోట్ల మంది చిన్న రైతులు, కూలీలు భూమికి దూరమయ్యారు.
చంద్రబాబుని ఒక దానికి మెచ్చుకోవాలి. ఇంకా తన అబద్ధాల్ని జనం నమ్ముతారని ఆత్మ విశ్వాసం ఉన్నందుకు.