నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీ లీడర్లే దిక్కయ్యారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్చార్జ్గా టీడీపీ అధిష్టానం నియమించింది. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని కూడా త్వరలో ఏదో ఒక నియోజకవర్గానికి ఇన్చార్జ్గా నియమించనుంది.
తాజాగా గన్నవరంలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున వల్లభనేని వంశీ గెలుపొంది, ఆ తర్వాత కాలంలో జగన్ మద్దతుదారుడిగా మారిపోయారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయనే బరిలో ఉండనున్నారు. వంశీ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన యార్లగడ్డ వెంకట్రావే టీడీపీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే గన్నవరంలో ఇంత కాలం వల్లభనేని వంశీ వ్యక్తిగత చరిష్మానే టీడీపీ బలంగా చెలామణి అవుతూ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. వంశీ వుండగా, యార్లగడ్డకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది.
కానీ యార్లగడ్డనే వైసీపీని బద్నాం చేసి, టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించాలనే వ్యూహంలో భాగంగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాటకాలాడారని వైసీపీ భావిస్తోంది. ఎట్టకేలకు వైసీపీ నుంచి ఆయన తప్పుకుని, టీడీపీ పంచన చేరడానికి సిద్ధమయ్యారు. గన్నవరంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో యార్లగడ్డ రాక పెద్ద ఉపశమనంగా ఆ పార్టీ సంతోషిస్తోంది.