పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్ర తొలి శ్రావణ శుక్రవారంతో ముగిసింది. రెండు బహిరంగ సభలు నాలుగు ప్లేసెస్ విజిట్స్, జనవాణి కార్యక్రమంతో విశాఖలో పవన్ వారాహి యాత్ర ముగిసింది. విశాఖ రూరల్ లో మళ్లీ యాత్ర ఉంటుందో లేదో తెలియదు.
మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ 2004 నుంచి ఉత్తరాంధ్రాను నాటి కాంగ్రెస్ నేడు వైసీపీలో ఉన్న నేతలు అంతా దోచేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే వాటి మీద విచారణ ఉంటుందని అంటున్నారు అయితే ఈ మధ్యలోనే అంటే 2014 నుంచి 2019 దాకా పవన్ మద్దతు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీలో రాజ్యమేలింది.
మరి అపుడు ఈ భూ కబ్జాల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో పవన్ చెప్పాలని అంటున్నారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 దాకా విశాఖ సహా ఉత్తరాంధ్రాలో జరిగిన భూ దందాల విషయంలో టీడీపీ నేతల పేర్లు వినిపించాయి. టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో వేసిన సిట్ కి దీని మీద ఫిర్యాదు చేశారు కూడా.
అలా నాడు టీడీపీ నేతల భూ దందా మీద కూడా పవన్ మాట్లాడి ఉంటే బాగుండేది అని అంటున్నారు. 2004 నుంచి వైఎస్సార్ హయాంలోనే భూ దందాలు జరిగాయని దోపిడీ చేశారని పవన్ విమర్శిస్తున్నపుడు తగిన చర్యలు అప్పట్లోనే తీసుకుని ఉంటే ఇంతదాకా కధ వచ్చేది కాదు కదా అని అంటున్నారు.
పవన్ చెప్పిన మరో మాట మాత్రం వాస్తవం అని అంతా అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా నుంచి చాలా మంది యువత ఉపాధి కోసం బయటకు వెళ్తున్నారు, ఈ ప్రాంతాలను రాజకీయ నాయకులు శాసిస్తున్నారు అని పవన్ అన్నారు. వారంతా వలస నాయకులే. టీడీపీ తోనే వచ్చిన వలస నాయకులే దశాబ్దాలుగా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్నారు. ఆ సంగతి పవన్ చెబితే బాగుండేది అంటున్నారు.
పవన్ మరో మాట అన్నారు. ఉత్తరాంధ్రాలో ఎవరూ ఏమీ చేయలేరని అడగలేరనే భూ కబ్జాలు అని. అది కూడా వాస్తవమే. వలస నాయకులే అంతా ఈ ప్రాంతాలను పట్టుకుని ఉన్నారు. కాబట్టే స్థానికంగా ఎవరూ సరైన లీడర్లు లేకపోవడం వల్ల కూడా ఉత్తరాంధ్రా ఇబ్బందుల్లో పడుతోంది.
పవన్‌కి నిజంగా ఉత్తరాంధ్రా మీద చిత్తశుద్ధి ఉంటే టీడీపీని కూడా గట్టిగా విమర్శించేవారు అని అంటున్నారు. టీడీపీ భూ దందాలు సిట్ మీద ఏమీ అనకుండా కేవలం వైసీపీ ఏలుబడిలోనే ఏదో జరిగిపోయిందన్న ఇంప్రెషన్ కలిగించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాకు రాజధాని అంటే భూములను దోచుకోవడం కోసమే అని పవన్ అనడాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అభివృద్ధి కోసం తాము ప్రయత్నం చేస్తూంటే పవన్ ఇలా మాట్లాడడం ఏంటని ఫైర్ అవుతున్నారు.