జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ప్రజలంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. ప్రజల చైతన్యంపై ఆయనకు చిన్న చూపు ఉందనేందుకు… సీఎం పదవిపై ఆయన చేసిన కామెంట్సే నిదర్శనం. రాజకీయాల్లో నిలకడలేని తనానికి పవన్ భారీ ఉదాహరణ. అందుకే పవన్ గురించి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తించుకోవచ్చు. సరిగ్గా మూడు నిమిషాలు నిలకడగా నిలబడి మాట్లాడితే పవన్‌తో పొత్తు గురించి ఆలోచించాలని తన పార్టీ నాయకుడు రామకృష్ణకు సలహా ఇచ్చినట్టు నారాయణ గతంలో చెప్పారు.
ఈ నేపథ్యంలో విశాఖలో వారాహి యాత్ర ముగింపు సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
“ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజల మద్దతు పూర్తిగా వుంటే ఓకే. ఎన్నికలు అయ్యాక ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎవరనేది వుంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనేది నా ఉద్దేశం”
ప్రజలు విజ్ఞులని గ్రహించిన నాయకులెవరైనా ఇలాంటి మాయ మాటలు చెప్పరు. ఎందుకంటే ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా అధికంగా ఏ పార్టీ పోటీ చేస్తుందే, సంబంధిత నాయకుడే ముఖ్యమంత్రి అవుతారనేది చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సీఎం ఎవరో తేలుతుందని సెలవిచ్చారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడే నాయకుల్ని జనం పిచ్చివాడి కింద జమ కడతారని పవన్ ఎందుకు గ్రహించలేకపోతున్నారనే చర్చకు తెరలేచింది.
ఎన్నికల తర్వాత ఇక సీఎం ఎవరో నిర్ణయించేది ఏముంటుంది? సీట్ల పంపకాల్లోనే సీఎం ఎవరో తేలిపోతుంది. ఈ మాత్రం దానికి పవన్ ఎవరికీ ఏమీ తెలియదన్నట్టు చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమనే విమర్శ వినిపిస్తోంది. పవన్‌లాంటి లీడర్లను ప్రజలు ఎంతో మందిని చూసి వుంటారు. అందుకే ఎన్నికల్లో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, చివరికి పట్టం మాత్రం కట్టాల్సిన వారికే కట్టబెడతారు.