పవన్‌కల్యాణ్ మాటలకు అర్థాలే వేరు. పవన్ చెబుతున్న ఏ ఒక్క అంశంపై కూడా ఆయన స్థిరంగా నిలబడరు. పొత్తులపై విశాఖలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం టీడీపీతో పొత్తా? లేక టీడీపీ-బీజేపీ కూటమితో కలిసి పోటీ చేయడమా? అనేది ఇంకా చర్చలు కొలిక్కి రాలేదన్నారు. పొత్తు మాత్రం ఖాయమని ఆయన చెప్పారు. అయితే ఆయన ఒక విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేలా పొత్తు వుంటుందన్నారు.
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తప్ప, తనకే ఎలాంటి లక్ష్యాలు, ఆశయాలు లేవని పవన్ చెప్పకనే చెప్పారు. సహజంగా ఎన్నికల్లో అత్యధికంగా రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. పవన్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి రివర్స్‌లో ఆయన పంథా సాగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా కేవలం 20 లేదా 25 సీట్లతోనే సరిపెట్టుకోలేమని, గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని ఆయన గతంలో చెప్పారు.
అప్పుడేదో తన అభిమానులు, జనసేన కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు అలా చెప్పారని అర్థమవుతోంది. సీఎం జగన్‌ను ఓడించడం కంటే గౌరవమేదీ ఉండదని చివరికి ఆయన ఒక ప్రకటనతో తన పార్టీ శ్రేణుల్ని బలిపెట్టడానికి వెనుకాడరనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్‌పై పవన్ వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. చంద్రబాబుకు కూడా జగన్‌పై ఇంతగా కసి ఉండకపోవచ్చు. అదేంటో కానీ, ప్రధాన ప్రత్యర్థే కాని పవన్‌కు జగన్‌పై ఎందుకంత కోపమో అంతుచిక్కడం లేదు.
గౌరవంగా తమకు సీట్లు కేటాయిస్తేనే పొత్తు అనే మాటలన్నీ ఉత్తుత్తివే. జగన్‌పై పవన్ కోపాగ్ని చల్లారాలి. ఇందుకోసం ఎలాంటి సీట్లు ఇవ్వకపోయినా సరే పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మీడియా, జనం ముందు పవన్ మాట్లాడేవాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కదానిపై కూడా పవన్ నిలబడరని కాలం తేల్చి చెప్పేందుకు మరెంతో దూరం లేదు.