వేదికలపై మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు మరిచిపోవడం సహజం. అవి పెద్ద విషయాలే అయినప్పటికీ ఆ టైమ్ కు మరిచిపోతుంటారు కొందరు. ఆ తర్వాత సరిదిద్దుకుంటారు. మొన్నటికిమొన్న తన సినిమా దర్శకుల గురించి మాట్లాడుతూ పూరి జగన్నాధ్ పేరును చెప్పడం మరిచిపోయాడు మహేష్. ఆ వెంటనే తప్పు తెలుసుకొని ట్విట్టర్ లో ప్రత్యేకంగా పూరి పేరును ప్రస్తావించాడు. ఈమధ్య నాగార్జున కూడా త్రివిక్రమ్ గురించి చెప్పడం మరిచిపోయాడు. కానీ ఇక్కడ విషయం వేరే.
మన్మథుడు సినిమా గురించి ప్రస్తావిస్తూ, ఆ క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడు విజయ్ భాస్కర్ కు ఆపాదించాడు నాగ్. అయితే ఆ టైమ్ లో త్రివిక్రమ్ గురించి చెప్పడం మరిచిపోయి ఉంటాడని అంతా సర్దిచెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత నాగ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. చివరికి ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఆ టాపిక్ వస్తే రెస్పాండ్ అవ్వలేదు.
“మన్మథుడు టైమ్ కు నాకు తెలిసింది విజయ్ భాస్కరే. నాకు కథ చెప్పింది ఆయన. నాకు రోజూ కామెడీ పంచ్ లు వినిపించింది ఆయన. అందుకే మన్మథుడు క్రెడిట్ ను ఆయనకిచ్చాను.” ఇంతకుమించి వివరణ ఇవ్వడానికి ఇంకేం లేదన్నట్టు రెస్పాండ్ అయ్యాడు నాగ్. ఆ టాపిక్ ను కొనసాగించడానికి కూడా ఇష్టపడలేదు. నిజానికి మన్మథుడు సినిమా క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ దే. ఎవర్నడిగినా ఈ విషయం చెబుతారు. కానీ నాగ్ మాత్రం మన్మథుడు విషయంలో త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు.
తాజా ఘటనతో నాగ్ కావాలనే త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకురాలేదని విషయం స్పష్టమైంది. కాకపోతే త్రివిక్రమ్ అంటే నాగార్జునకు ఎందుకు పడట్లేదనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ఒకటిమాత్రం క్లియర్. నాగ్-త్రివిక్రమ్ మధ్య గతంలో ఏదో జరిగింది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది.