బైడెన్ చెప్పింది నిజ‌మే క‌దా!

అఫ్గానిస్తాన్ నుంచి త‌మ సేన‌ల‌ను ఖాళీ చేయించే ఏర్పాట్లు చేస్తున్న‌ప్పుడే అమెరికా ఒక అంచ‌నాకు వ‌చ్చింద‌ట‌. తాము అక్క‌డ నుంచి ఖాళీ చేస్తే నెల రోజుల్లోపు తాలిబ‌న్లు ఆ దేశాన్ని ఆక్ర‌మిస్తార‌ని అప్పుడు అమెరికా…

అఫ్గానిస్తాన్ నుంచి త‌మ సేన‌ల‌ను ఖాళీ చేయించే ఏర్పాట్లు చేస్తున్న‌ప్పుడే అమెరికా ఒక అంచ‌నాకు వ‌చ్చింద‌ట‌. తాము అక్క‌డ నుంచి ఖాళీ చేస్తే నెల రోజుల్లోపు తాలిబ‌న్లు ఆ దేశాన్ని ఆక్ర‌మిస్తార‌ని అప్పుడు అమెరికా అంచ‌నా వేసింది. అయితే అంత స‌మ‌యం కూడా ప‌ట్టిన‌ట్టుగా లేదు తాలిబ‌న్ల‌కు. కేవ‌లం ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే వారు ఆ దేశంపై పూర్తి ఆధిప‌త్యాన్ని సాధించారు.

20 సంవ‌త్స‌రాల పాటు అమెరికా సంకీర్ణ సేన‌లు అక్క‌డ మ‌కాం పెడితే.. వారు అక్క‌డ నుంచి ఖాళీ చేసిన ఇర‌వై రోజుల్లో మ‌ళ్లీ అక్క‌డ తాలిబ‌న్లు పాగా వేశారు. ఈ అంశంపై అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ మాట్లాడుతూ.. త‌మ ల‌క్ష్యం నెర‌వేరింద‌ని మొద‌ట అన్నారు. అఫ్గాన్ లో ప్ర‌జాస్వామ్యం నెల‌కొల్పడం త‌మ ల‌క్ష్యం కాద‌న్నారు. ఇది బైడెన్ చేత‌గానిత‌న‌మ‌న్న‌ట్టుగా కొంత‌మంది వాదిస్తున్నారు.

అయితే ఈ అంశం మీదే బైడెన్ స్పందిస్తూ.. ఇంకో ఇర‌వై సంవ‌త్స‌రాల పాటు సంకీర్ణ సేన‌లు అక్క‌డే మ‌కాం పెట్టి ఉన్నా, ప‌రిస్థితి మారేది కాదన్నారు. గ‌త ఇర‌వై యేళ్లుగా అక్క‌డ నుంచి తాలిబ‌న్ల‌ను తోలి పెడితే, ఇర‌వై రోజుల్లో వాళ్లు మ‌ళ్లీ ఆక్ర‌మించారు. మ‌రి ఇంకో ఇర‌వై సంవ‌త్స‌రాల పాటు అమెరికా అక్క‌డే ఉండినా.. తాలిబ‌న్ల ప‌త‌నం మాత్రం జ‌రిగేది కాదు. అప్పుడు కూడా ఇంకో ఇర‌వై రోజుల్లో మ‌ళ్లీ వారు ఇదే సీన్ క్రియేట్ చేయ‌గ‌లిగే వారు.

ఈ అంశం గురించి వ‌స్తున్న విశ్లేష‌ణ‌ల్లో.. సైన్యంలో తీవ్ర స్థాయికి చేరిన అవినీతి కూడా ఒక కార‌ణ‌మ‌నే మాట వినిపిస్తూ ఉంది. విదేశాల నుంచి వ‌చ్చిన డ‌బ్బుల‌ను నేత‌లు, సైన్యం మింగి కూర్చుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సైనికులు, పోలీసులు పూర్తిగా అవినీతియ‌మం అయ్యార‌నే మాటా వినిపిస్తోంది.  పారిపోయిన దేశాధ్య‌క్షుడు కూడా ఒక్క‌డే వెళ్లిపోలేదు. వీలైనంత డ‌బ్బును త‌న వెంట తీసుకెళ్లిపోయాడ‌ట‌! కార్ల‌లో, హెలికాప్ట‌ర్ల‌లో డాల‌ర్ల‌ను త‌ర‌లించుకు వెళ్లిన‌ట్టుగా ఉన్నాడాయ‌న‌. అదీ క‌థ‌. అమెరికా వెనుక‌న్నంత‌సేపూ వారు వాపును చూపించారు. అది బ‌లుపు కాద‌ని పూర్తి క్లారిటీ వ‌స్తోంది.

అయితే ఇప్పుడు అఫ్గాన్ ప్ర‌జ‌ల‌కు తాలిబ‌న్ల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఒక‌టే మార్గం ఉంది. అదే తిర‌గ‌బ‌డ‌టం. ఇది వ‌ర‌కూ అర‌బ్ స్ప్రింగ్ స‌మ‌యంలో త‌లెత్తిన ఉద్య‌మాల త‌ర‌హావి అఫ్గాన్ లో త‌లెత్తితే  తాలిబ‌న్ల పీచ‌మ‌నచ‌గ‌ల‌రేమో. పెద్ద పెద్ద  నియంత‌ల‌నే వివిధ దేశాల్లో ప్ర‌జ‌లే గ‌ద్దె దించారు. అలా తాలిబాన్ల‌పై వారు తిర‌గ‌బ‌డితే ప్ర‌యోజ‌నం ఉండొచ్చు. అయితే అమెరికా అన్నేళ్ల మ‌కాంలోనే తాలిబ‌న్లు త‌మ ఉనికిని కాపాడుకుని ఇప్పుడు రెచ్చిపోతున్నారు.

క‌నీసం అమెరికా సేన‌లు అక్క‌డే ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌లు తాలిబ‌న్ల ను పూర్తిగా అంత‌రింప‌జేయాల‌ని అనుకుని ఉంటే స‌రిపోయేదేమో. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు అస‌లు జ‌రిగేలా లేదు. ప్ర‌జ‌ల‌కు తాలిబ‌న్లంటే భ‌య‌ముంది కానీ, వారిని అప్పుడే అంతం చేయాల‌నే క‌సి మాత్రం లేక‌పోయిన‌ట్టుగా ఉంది. మ‌రి వారి త‌ర‌ఫున కూడా అమెరికా ఎన్నేళ్లు పోరాటం చేయ‌గ‌ల‌దు?