Mr Pregnant Review: మూవీ రివ్యూ: మిస్టర్ ప్రెగ్నెంట్

చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ రేటింగ్: 2.5/5 తారాగణం: సోహేల్, రూప, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజి, రాజారవీంద్ర, మధుమణి తదితరులు  సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ కెమెరా: నిజార్ షఫి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి నిర్మాతలు:…

చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్
రేటింగ్: 2.5/5
తారాగణం:
సోహేల్, రూప, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజి, రాజారవీంద్ర, మధుమణి తదితరులు 
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
కెమెరా: నిజార్ షఫి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: అప్పిరెడ్డి, రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి
విడుదల: ఆగష్ట్ 18, 2023

కొత్తరకంగా అనిపించడంతో “మిష్టర్ ప్రెగ్నెంట్” ట్రైలర్ ఆకట్టుకుంది. ఏముంటుందా ఇందులో అనే అంచనాలకు తెరలేపింది. 

కథలోకి వెళ్తే గౌతం (సోహేల్) ఒక టాటూ ఆర్టిస్ట్. మహా (రూప) అతనిని ప్రేమిస్తుంది. పెళ్లికి ఒప్పుకుంటాడు కానీ పిల్లలు వద్దంటాడు. ఆ కండిషన్ మీద పెళ్లి చేసుకుంటారు. కానీ అనుకోకుండా ఆమె గర్భవతి అవుతుంది. గౌతం ఆ గర్భాన్ని తాను మోస్తానంటాడు. ఎందుకీ అర్ధం లేని పని అని అనుకుంటుంది మహా. దానికి అతని కారణాలేవో అతను చెప్తాడు. మొత్తానికి సర్జరీ ద్వారా గర్భసంచిని ధరించి, అందులో భార్య కడుపులోని పిండాన్ని ఇతను మోయడం మొదలుపెడతాడు. అక్కడి నుంచి వాళ్లకెదురయ్యే సవాళ్ళేవిటి అనేది మిగిలిన కథ. 

“పడమటి సంధ్యారాగం” సినిమాలో ఒక డైలాగుంటుంది..”..తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గెడ్డం పెంచగలదా? మగాడు బిడ్డని కనగలడా?” అని. అలా మగాడు బిడ్డని కంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుని కామెడీ జానర్లో “జంబలకిడిపంబ”లో చూసాం. దానిని సీరియస్ సబ్జెక్ట్ గా ఎవ్వరూ డీల్ చెయ్యలేదు. 

ఇప్పుడదే ఐడియాకి ఎక్కడో జరిగిన కొన్ని సంఘటనల్ని సాక్ష్యంగా చూపిస్తూ కథగా మలచుకుని సినిమాగా తీసారు. ఇలాంటి కొత్త కథ ఎంచుకున్నందుకు ప్రశంసించవచ్చు. కానీ కొత్త కథకి కొత్త కథనం కూడా తోడై ఉంటే బాగుండేది. 

ఒక మగాడు బిడ్డని కనాలని ఎందుకనుకుంటాడు? దీనికి కథగా ఎన్నో దారులు వేసుకోవచ్చు. బాల్యంలో సంఘటనలు, తద్వారా ఏవో ఫోబియాలు, ఆపైన ప్రియురాలిపై ప్రేమ…ఇవన్నీ కలగలిపి తీయడం పరమ రొటీన్. దీనికి మళ్లీ సోషల్ యాంగిల్, దానికి తోడు సెంటిమెంటు…మాతృత్వంలో లోతు తెలియాలంటే బిడ్డని నవమాసాలు మోస్తేనే తెలుస్తుంది లాంటి స్త్రీవాదకోణం…అన్నీ కలగలిపి చాలా ప్రెడిక్టిబుల్ గా ముగిసింది. 

వినూత్న కథాంశం పేరుతో వచ్చిన “ఏక్ మిని కథ” లాంటి ఎబ్బెట్టైన సబ్జెక్ట్ కంటే ఇది డీసెంట్ కథ అనే చెప్పుకోవాలి. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ప్రతిపాదించిన ఎమోషన్ బాగానే ఉన్నా ట్రీట్మెంట్ విషయంలో కొత్త పంథా తొక్కలేకపోయాడు. 

కథలో ముందుగా హీరోని ఒక టాటూ డిజనర్ గా చూపించడం, అందులో కాంపిటీషన్, అక్కడొక విలన్..ఇవన్నీ చాలా ఎమెచ్యూర్ గా అనిపించిన అంశాలు. 

విలన్ పాత్ర చాలా కృతకంగా, అతిగా అనిపించింది. మొదట్లో కనిపించిన విలన్ తానింకా కథలో ఉన్నానని గుర్తుచేస్తూ ఒక ఫైట్ సీన్లో చివర్లో మళ్లీ కనిపిస్తాడు. అతను, అతని రివెంజ్..రెండూ పేలవంగానే ఉన్నాయి. 

సినిమా మొదలైన చాలాసేపటి వరకు పాయింటులోకి రాదు. సగం సమయం గడిచాక గానీ హీరోగారి ప్రెగ్నెన్సీ నిర్ణయం బయటపడదు. అక్కడ నుంచి అసలు కథన్నమాట. 

శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ఒకటి రెండు పాటలు కూడా సందర్భోచితంగా బాగున్నాయి. “ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా..” బాగుంది. అలాగే “నమోస్తుతే అర్ధనారీశ్వరా..” మంచి టైమింగ్ సెన్స్ తో వినిపిస్తుంది. 

ఇక బ్రహ్మాజీ మీద హోమోసెక్సువల్ కామెడీ ఔట్ డేటెడే.

హీరో సోహేల్ బాగానే చేసాడు కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు.

హీరోయిన్ రూప పాత్రలో పెద్ద డెప్త్ లేదు. 

వైవా హర్ష హీరో పక్కన ఒక రొట్టకొట్టుడు రొటీన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు.

బ్రహ్మాజి కామెడీ ఉన్నంతలో కాస్త పర్వాలేదు.

రాజారవీంద్ర హీరోయిన్ తండ్రిగా అలా కనిపించి ఇలా మాయమవుతుంటాడు.

డాక్టర్ పాత్రలో సుహాసిని అతిథి పాత్రకి ఎక్కువ, పెద్ద పాత్రకి తక్కువ అన్నట్టుంది. 

2021లో మరణించిన ప్రముఖ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇందులో రెండు సీన్స్ లో కనిపిస్తారు. దీనిని బట్టి ఈ సినిమా నిర్మాణం ఎప్పుడు మొదలయిందా అనిపిస్తుంది!

కథా కథనాలన్నీ పరిశీలించిన పిమ్మట ఈ “మిస్టర్ ప్రెగ్నెంట్” కొత్త పాయింటుతో వచ్చిన పాతరకం సినిమాలా అనిపిస్తుంది. 

బాటం లైన్: కొత్త కథ-పాత కథనం