ఆఫ్ఘనిస్తాన్: సింహాలకి వేటకుక్కలు ఎందుకు మోకరిల్లాయి?

దేశాన్ని ముష్కరమూకలకి ఇచ్చేసి దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడమేమిటి? Advertisement ప్రాణభయంతో ప్రజలు ఎగురుతున్న విమానం చక్రాలు సైతం పట్టుకుని పలాయనం చిత్తగించడమేమిటి? రకరకాల మారణాయుధాలతో ముష్కరులు నగర వీధుల్లో స్వైరవిహారం చేయడమేమిటి? ఆర్మీ…

దేశాన్ని ముష్కరమూకలకి ఇచ్చేసి దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడమేమిటి?

ప్రాణభయంతో ప్రజలు ఎగురుతున్న విమానం చక్రాలు సైతం పట్టుకుని పలాయనం చిత్తగించడమేమిటి?

రకరకాల మారణాయుధాలతో ముష్కరులు నగర వీధుల్లో స్వైరవిహారం చేయడమేమిటి?

ఆర్మీ కూడా ప్రతిఘటించకుండా ముష్కరుల ముందు మోకరిల్లడమేమిటి?

ఇదంతా జరుగుతున్నది 2021లోనేనా?

సిరియా, ఇరాకుల్లో ఐసిస్ దమనకాండ తర్వాత మళ్లీ అటువంటి దృశ్యాలు ప్రపంచం చూడదనుకున్నారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ సుమారు 30 ఏళ్ల గతానికి వెళ్ళింది. ఆ దేశం తాలిబన్ల వశమయ్యింది. దేశంలో అధ్యక్షుడు లేడు, ప్రభుత్వం లేదు, వ్యవస్థ లేదు. అంతా తాలిబన్ల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిందే.

ఆ దేశంలో ఆర్మీ లేదా అంటే లక్షల్లో ఉంది. వారంతా గత 20 ఏళ్లుగా అమెరికా ట్రైనింగులో ఆరితేరిన సైనికులే. తాలిబన్లు ఉన్నది కేవలం వేలల్లోనే. కానీ ఆ జవాన్లు ఇప్పుడు తాలిబన్లకి లొంగిపోయారు. వాళ్లు చెప్పిన పని చేస్తామంటున్నారు. ఎందుకిలా జరిగింది? అసలెక్కడ తేడా వచ్చింది?

దీనికి సమాధనం ఒక్కటే. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వేటకుక్కలు సింహాలు కాలేవు. అది ప్రకృతి సహజం. పొదల చాటు నుంచి సింహాలు బయటికి రాగానే వేటకుక్కలు, తోడేళ్లు, నక్కలు అన్నీ సింహాల కాళ్లదగ్గర మోకరిల్లాయి. జింకలు, దుప్పులు లాంటి సాధు జంతువులు పారిపోతున్నాయి.

సింహాల్లాంటి తాలిబన్లకి ఎదురెళ్లి అడవి లాంటి ఆఫ్ఘనిస్తాన్ ని ఏలడం కష్టమని వేటకుక్కలు, తోడేళ్లు అనుకుంటున్నాయి. అఫ్ఘన్ జాతీయుల నరనరాల్లోనూ తాలిబన్లంటే అలాంటి భయం ప్రవహిస్తోంది.

అమెరికా దానిని ఎప్పుడూ గుర్తించలేదు.

“తాలిబన్లని 20 ఏళ్లుగా తొక్కి ఉంచాం. అక్కడి స్థానికులని ఆర్మీ జవాన్లుగా మార్చాం. వాళ్లకి తాలిబన్లని ఎదుర్కొనే కండ పుష్టి ఇచ్చేసాం. కనుక మన అమెరికన్ ఆర్మీకి ఇక ఆదేశంలో పని లేదు” అని అనుకుంది. వాళ్ళని వెనక్కి వచ్చేయమంది. ఆ తర్వాతే తెలిసింది. అఫ్ఘన్ ఆర్మీ జవాన్లకి ట్రైనింగు ద్వారా కండ పుష్టి ఇవ్వగలిగాము కానీ తాలిబన్లని ఎదుర్కొనే గుండె పుష్టి ఇవ్వలేకపోయామని. అదీ పరిస్థితి.

ప్రస్తుతం ప్రపంచమీడియా దృష్టంతా అఫ్ఘనిస్తాన్ పైనే. చాలామంది ఊహించినట్టే జరిగింది కానీ ఇంత త్వరగా జరుగుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఇలాంటి దృశ్యాలు చూడాల్సొస్తుందని కూడా అనుకోలేదు.

నిజానికి అమెరికాని కూడా ఇక్కడ తప్పు పట్టలేం. అధ్యక్షులు ముగ్గురు మారినా ఆ దేశం సొంత వనరులు వెచ్చించి 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొల్పే పనులు చేసింది. ఇక పర్వాలేదనుకుంది. వెనక్కి మళ్ళింది. దాక్కున్న తాలిబన్లు బయటికొచ్చేసారు. ఎదుర్కొంటారనుకున్న ఆర్మీ, వాళ్లకి దాసోహమని వాళ్లతో కలిసిపోయింది. ఇక వాళ్ల ఖర్మ.

తాను తలచింది ఒకటి, దైవం తలచింది ఇంకొకటి అన్నట్టుగా 20 ఏళ్లల్లో అమెరికా చేసిందేమిటంటే, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లని అణచెయ్యాలని దిగి పదింతలు శక్తి పుంజుకునేలా చేసింది.

“మా పౌరుల్ని మేమేం చెయ్యం. పద్ధతైన ఇస్లామిక్ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ని మలుస్తాం. స్త్రీలు చదువుకోవచ్చు. అయితే పూర్తి స్థాయి హిజాబ్ పాటించాల్సిందే. తాలిబన్ చట్టం ప్రకారం నడుచునే ఎవ్వరికీ సమస్య ఉండదు”, అని ఒక తాలిబన్ ప్రతినిధి అల్ జజీరా తో చెప్పాడు.

“రక్తపాతం ఆపడానికే నేను శాంతయుతంగా దేశాన్ని తాలిబన్ల చేతిలో పెట్టాను. ప్రతిఘటిస్తే ఏం జరుగుతుందో తెలుసు” అని పారిపోయిన దేశాధ్యక్షుడు చెప్పాడు.

“అన్ని దేశాలు సంఘటితమై ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి కలగకుండా చూడాలి. ముఖ్యంగా మహిళల, పిల్లల హక్కులు కాలరాయకుండా కాపాడుకోవాలి” అని యూ.ఎన్.ఓ వారు అత్యవసర సమావేశంలో చెప్పారు.

“ప్రపంచ మీడియాకి తాలిబన్లు ఏం చెప్పినా స్త్రీలపై సామూహిక అత్యాచారాలు, శాశ్వత బానిసత్వం ఇక ఆ దేశంలో నిత్యకృత్యాలౌతాయి”, అని ఆ దేశం పరిస్థితులపై అవగాహన ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ విదేశీ మీడియాకి చెప్పాడు.

“త్వరలోనే తాలిబన్లు తమలో తామే కొట్టుకుని ఆధిపత్య పోరు కోసం ఆయుధాలెత్తుతారు. అప్పుడు మళ్లీ అమెరికా సీన్లోకి వస్తుంది”, అని ఒక కాలమిస్ట్ జోస్యం చెప్పారు.

ఏది ఏమైనా అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్న భారతీయులు వెనక్కి వచ్చే ఏర్పాటు మన దేశ విదేశాంగ శాఖ చూడాలి.

ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచమంతా భయపడేలా చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క టూరిస్టు ధైర్యం చేసి రాని చోట సంపద ఎలా వస్తుంది?

దీనికి సమాధానం ఒక్కటే. మొత్తం ప్రపంచంలోని 95% ఓపియం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. ఆ డ్రగ్ ని లీగలైజ్ చేసుకుని ప్రపంచానికి అమ్ముకోవడమే. ఇది కాక ఉన్నవి సహజ ఖనిజాలు. ఇంతకు మించి ఆ దేశంలో వేరే సంపదలేవీ చెప్పుకునేటంతగా లేవు.

ఆఫ్ఘన్ సింహాసనాన్ని ఎక్కుతున్న తాలిబన్ నాయకుడు హిబాతుల్లా విధానాలు ఎలా ఉంటాయో చూడాలి. సద్దాం, ఇదీ అమీన్, గడాఫీ మాదిరిగా ఉంటుందా లేక మరింత క్రూరంగా ఉంటుందా అనేది కాలమే చెప్పాలి.  

ఓం ప్రసాద్