దివంగతులైన భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభలపై ఛీటింగ్ కేసు నమోదైంది. చనిపోయిన వారిపై ఛీటింగ్ కేసుకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అరె…దర్శకుడు రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ సినిమాకు మించిపోయిన కథలా వుందే అనే అభిప్రాయం కలుగుతోంది. కన్న కూతురే తల్లిదండ్రులపై ఛీటింగ్ కేసు పెట్టించిందనే అభిప్రాయం ఎవరిలోనైనా కలిగితే, అది వారి తప్పే తప్ప, మాజీ మంత్రిది మాత్రం కాదని తెలుసుకోవాలి.
గతంలో హైదరాబాద్‌లో ఓ స్థలాన్ని మైనర్ అయిన తనకు తెలియకుండా తండ్రి నాగిరెడ్డితో పాటు అక్కలైన భూమా అఖిలప్రియ, మౌనికలపై జగత్‌విఖ్యాత్ రెడ్డి కోర్టుకెళ్లడం మరోసారి గుర్తుకు తెస్తోంది. అప్పట్లో జగత్ తరపున కోర్టులో కేసు వేసిన న్యాయవాది అతని బావ భార్గవ్ స్వయాన సోదరుడైన సంగతి తెలిసిందే. తాజాగా వెలుగు చూసిన కేసులో భూమా దంపతులతో పాటు అఖిలప్రియ, మౌనిక, జగత్‌విఖ్యాత్‌లపై న్యాయస్థానంలో కేసు వేసిన మహానుభావుడు భార్గవ్ అనుచరుడైన గుంటూరు శ్రీను తండ్రి వెంకట రామయ్య.
2011, డిసెంబర్లో భూమా నాగిరెడ్డి తన కుటుంబ అవసరాల నిమిత్తం నంద్యాల ఆంధ్రాబ్రాంక్లో లోన్ తెచ్చుకున్నారు. ఆయన జీవించినంత కాలం నెలవారీ కంతులు చెల్లిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో శోభమ్మ, ఆ తర్వాత నంద్యాల ఎమ్మెల్యేగా నాగిరెడ్డి అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లారు. భూమా దంపతుల మరణం తర్వాత బ్యాంకులకు ఆయన వారసులు చెల్లించలేదు. దీంతో వడ్డీతో కలిపి సుమారు రూ.19 కోట్ల వరకూ బ్యాంకులకు చెల్లించాల్సి వుంది.
రుణాన్ని చెల్లించాలని అనేక దఫాలు భూమా వారసులైన అఖిలప్రియ, ఆమె కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. అయినా ఖాతరు చేయలేదు. దీంతో బ్యాంక్ అధికారులు సీరియస్ యాక్షన్‌కు దిగారు. తాకట్టు పెట్టిన ఆస్తుల్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు చివరి హెచ్చరికగా బ్యాంక్ అధికారులు అఖిలప్రియ, జగత్‌లకు తెలిపారు. ఊహూ, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
సరిగ్గా ఇదే సమయంలో సినీ ఫక్కీలో బ్యాంక్ రుణం ఎపిసోడ్లో కథ మలుపు తిరిగింది. 2011, ఆగస్టులో భూమా నాగిరెడ్డి దంపతులు తనకు రూ.45 లక్షలకు భూమి విక్రయించారని, ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా రాయించి ఇచ్చారని, డబ్బు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయించకుండా మోసగించారంటూ గుంటూరుకు చెందిన మాదాల వెంకట రామయ్య అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. తనను మోసగించారంటూ భూమా నాగిరెడ్డి దంపతులతో పాటు అఖిలప్రియ, ఆమె చెల్లి నాగ మౌనిక, తమ్ముడు జగత్విఖ్యాత్రెడ్డిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కోర్టులో కేసు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ తమ ముద్రను చాటుకున్నారు. ఈ కేసు వేసింది భార్గవ్‌కు అత్యంత సన్నిహితుడైన గుంటూరు శ్రీను తండ్రి వెంకట రామయ్య కావడం గమనార్హం. గతంలో టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులోనూ, అలాగే హైదరాబాద్‌లో స్థల వివాదానికి సంబంధించి కిడ్నాప్ కేసులోనూ గుంటూరు శ్రీను నిందితుడు. అలాగే గుంటూరు శ్రీను తండ్రికి లాయర్ మరెవరో కాదు. అఖిలప్రియ లాయర్ శివప్రసాద్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించే చిన్న లింగమయ్య.
పైన పేర్కొన్న కథనం చదివిన తర్వాత భూమా నాగిరెడ్డి దంపతులతో పాటు అఖిలప్రియ, ఆమె చెల్లి, తమ్ముడిపై ఛీటింగ్ చేశారని కోర్టుకెక్కడానికి దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.80 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని కేవలం రూ.45 లక్షలకే భూమా దంపతులు అమ్మారంటే…పాపం వాళ్ల ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అని జాలి చూపొచ్చు. బ్యాంక్ రుణాల్ని చెల్లించకుండా, అలాగే ఆస్తుల్ని సొంతం చేసుకోవాలని అఖిలప్రియ, భార్గవ్‌రామ్ తమకు మాత్రమే సొంతమైన బుర్రను ప్రయోగించారనే ఆలోచన ఎవరూ చేయవద్దు. వాళ్లు అలాంటి వాళ్లు కానేకాదు. దివంగతులైన తల్లిదండ్రులపై ఛీటింగ్ కేసు పెట్టేంత వరకూ అఖిలప్రియ, ఆమె భర్త దిగజారారనే ఆలోచన మనసులోకి రానీయకండి.
ఒకవేళ వస్తే అది మీ తప్పు. ఈ కథనం చదివిన తర్వాత రాంగోపాల్‌వర్మ తనకు అఖిలప్రియ అద్భుతమైన కథ అందించారని సంబరపడొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన కలగొచ్చు. అయితే జనం మదిలో ఎలాంటి ఆలోచన వచ్చినా ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబుకు మాత్రం పిచ్చిరేగి, ఛీ…కన్న తల్లిదండ్రులపై ఛీటింగ్ కేసు పెట్టించేంతగా తమ నాయకురాలు దిగజారిందా? అనే ఏవగింపు వస్తేనే ఇబ్బంది. ఏమోనబ్బా… వాళ్ల అమ్మానాయన, వాళ్ల ఆస్తిపాస్తులు, వాళ్ల లాయర్లు, వాళ్ల ఇష్టం.