చూరు కాలి ఒకడేడుస్తుంటే, చూరులో ఉండిన చుట్టల గురించి ఇంకొకడు ఏడ్చాడట! అసలే ఆదిపురుష్ టీజర్ కు వచ్చిన రియాక్షన్ ఆ సినిమా యూనిట్ ను ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్టుగా ఉంది. విజువల్ క్వాలిటీ పరమ చెత్తగా ఉండటంతో.. ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఎలా క్రియేట్ చేస్తారనేది పెద్ద కొశ్చన్ గా మారింది.
టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు ఏవైనా ఉండి ఉంటే అవి కాస్తా నేలకంటాయి. ట్రైలర్ వరకూ వచ్చే సరికి ఈ పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా? లేక అసలే మాత్రం ఆసక్తి లేకుండా పోతుందా! అనే అంశం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది.
ఆ సంగతలా ఉంటే… ఆదిపురుష్ పై వివాదాలు వార్తలకు ఎక్కుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాతో మొదలుపెడితే కమలం పార్టీ నేతల వరకూ వరస పెట్టి ఈ సినిమాపై తీవ్రంగా స్పందిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందినట్టుగా కనిపిస్తున్న ఈ సినిమాలో పాత్రలకు రామాయణ రూపురేఖలతో పోలికలు లేకపోవడంపై దుమారం రేగుతూ ఉంది. దీనిపై అనేక మంది భగ్గుమంటున్నారు. రావణ పాత్ర అల్లాఉద్ధీన్ ఖిల్జీని గుర్తు చేస్తోందనే కామెంట్ తో మొదలుపెడితే అనేక రకాలుగా దెప్పి పొడుస్తున్నారు జనాలు. విజువల్ క్వాలీపై పెదవి విరుపులకు ఈ సెటైర్లు అదనం!
అదలా ఉంటే.. ఈ సినిమాపై కమలం పార్టీ వాళ్లు హెచ్చరికల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ వారు తేల్చి చెబుతున్నారు. హిందువుల ఆదిగ్రంథం ఆధారంగా రూపొందినట్టుగా ప్రచారం పొందుతూ, రామాయణంతో పోలికలు లేని విధంగా ఈ సినిమా రూపొందిందని, దీన్ని విడుదల కానిచ్చే ప్రసక్తే లేదని వారు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి హెచ్చరికలతో కూడిన వివాదాలు కొత్త కాదు. పద్మావతి సినిమాతో మొదలుపెడితే.. మొన్నటి పృథ్విరాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా వరకూ.. ప్రతిదాన్నీ వివాదాలు వెంటాడాయి. నిషేధ డిమాండ్లు, హెచ్చరికల పరంపర కొనసాగింది. ఇలాంటి నేపథ్యంలో ఆదిపురుష్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
మరి ఈ వివాదాలు కొన్ని సినిమాలను కొంత వరకూ కాపాడాయి. వీలైనంత ప్రచారాన్ని ఇచ్చాయి. ఆదిపురుష్ కు కూడా ఇవి అడ్వాంటేజ్ లు గా మారి, ఉచిత పబ్లిసిటీని ఇచ్చి కలెక్షన్లకు ఏమైనా ఊతం ఇస్తాయేమో!