పవన్ మాటల మర్మమేమిటి?

ఎన్నికల్లో అధికారం సాధించలేకపోయిన తరువాత ప్రజారాజ్యంలో ఏ విధంగా అయితే చిరంజీవి మీద వత్తిడి తెచ్చి, కాంగ్రెస్ లో కలిపేసారో? ఇప్పుడు తనమీద కూడా అలాంటి వత్తిడి తెస్తున్నారని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు.…

ఎన్నికల్లో అధికారం సాధించలేకపోయిన తరువాత ప్రజారాజ్యంలో ఏ విధంగా అయితే చిరంజీవి మీద వత్తిడి తెచ్చి, కాంగ్రెస్ లో కలిపేసారో? ఇప్పుడు తనమీద కూడా అలాంటి వత్తిడి తెస్తున్నారని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో వున్న పవన్ కళ్యాణ్ ఇలా అనడం ఆశ్చర్యంగా వుంది. ఆఖరికి కార్యకర్త వున్నంత వరకు జనసేన ఇలాగే వుంటుందని ఒకసారి, వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు అన్నీ మనవే అని మరోసారి అనడం పవన్ వైఖరికి అద్దం పడుతున్నాయి.

కానీ ఆయనపై పార్టీ విలీనం కోసం వత్తిడి తెస్తున్నది ఎవరు అన్నదే సందేహంగా వుంది. ప్రజారాజ్యం విషయంలో జరిగింది వేరు. అక్కడ బోలెడుమంది ఎమ్మెల్యేలు వున్నారు. చిరంజీవికి మంత్రిపదవి మీద ఆశ పుట్టింది. పార్టీని కలిపేసి, మంత్రిపదవి తీసుకుని, అది వున్నన్నాళ్లు అనుభవించి, ఆఖరికి ఎంపీగా కూడా వున్నన్నాళ్లు వుండి, ఆపైన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పుడు కానీ, ఎప్పుడు కానీ చిరంజీవి మాత్రం తాను ఎవరివల్లనో పార్టీ కలిపేసానని అనలేదు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పెట్టిన దగ్గర నుంచీ ప్రజారాజ్యం ఫెయిల్యూర్ కు అందులో వున్న నాయకులే తప్ప, చిరంజీవి కారణం కాదని అంటూ వస్తున్నారు. ఆది నుంచీ కన్నబాబు, గంటా శ్రీనివాసరావు లాంటి మాజీ ప్రజారాజ్యం జనాల మీద పవన్ కోపానికి ఇదేకారణం కూడా.వారంతా కలిసి పార్టీని కలిపేయించారు అన్నది ఆయన అనుమానం.

సరే, అప్పుడు ప్రజారాజ్యానికి అంటే ఎంతోకొంత మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారంతా వత్తిడి తెచ్చి, కాంగ్రెస్ లో కలిపేస్తారా? తాము వెళ్లిపోయావాలా? అని వత్తిడి తెచ్చి వుంటారని కాస్సేపు అనుకుందాం. కానీ పవన్ పై వత్తిడి తేవడానికి ఎవరున్నారు. ఉన్నది ఒక్క ఎమ్మెల్యే. పోనీ జిల్లాకు ఓ నాయకుడి వంతున అయినా  వున్నారా? మొత్తం నాయకులు అందరూ కలిసి వత్తిడి తెస్తున్నారు అని అనుకోవడానికి.

అయినా అధికార పదవిలో లేని నాయకులు ఎలా వత్తిడి చేస్తారు? వత్తిడి చేయడం ఎందుకు? వాళ్లంతట వాళ్లే కావాల్సిన పార్టీలోకి వెళ్లిపోవచ్చు కదా? పార్టీ కలపాలని వత్తిడి చేస్తే అధికారంలో వున్న నాయకులు చేయాలి కానీ, అధికారంలో లేనివారు చేయరు. వాళ్లకు కావాల్సిన పార్టీలోకి వెళ్లిపోతారు.

మరి పవన్ కళ్యాణ్ తన మీద ఏదో భారీ వత్తిడి వుంది. అన్నింటిని భరించి, సహించి, పార్టీని నిలబెట్టుకుంటున్నా అంటూ చెప్పడం అంటే కాస్త అనుమానించాల్సిందే. కొంపదీసి ఆయన రివర్స్ లో మాట్లాడడం లేదు కదా?

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్