కాంగ్రెస్ ముక్త భారత్.. అంటూ 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ నినదించిన విషయం విదితమే. ప్రధాని అయ్యాక, దేశంలో కాంగ్రెస్‌ని అంతమొందించే ప్రక్రియను శరవేగంగా చేపట్టిన నరేంద్రమోడీ, తాజాగా కాశ్మీర్ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగించారు. నిజానికి, ఏడు దశాబ్దాలకు పైగా రగులుతున్న రావణ కాష్టాన్ని చల్లార్చే క్రమంలో మోడీ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎవరైనా సమర్థించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావులేదు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది. కానీ, అలాచేస్తే.. అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది.? బీజేపీ తీరుని విమర్శించే క్రమంలో, కాశ్మీర్ విషయమై అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది కాంగ్రెస్. తాజాగా, లోక్‌సభ సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు, 'కాశ్మీర్ భారత అంతర్గత సమస్యకాదు.. అది అంతర్జాతీయ సమస్య..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో, కాంగ్రెస్ 'కథ' భారతదేశంలో ముగిసిపోయినట్లేనన్నది సర్వత్రా విన్పిస్తోన్న అభిప్రాయం.
చాలామంది కాంగ్రెస్ ముఖ్యనేతలు, 'కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించి వుంటే బావుండేది. బీజేపీ పన్నిన వ్యూహంలో ఇరుక్కుపోయాం. కాశ్మీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి, దేశ ప్రజల నుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం. కాశ్మీర్ ప్రజల తరఫున మాట్లాడుతున్నామనే భ్రమలో కొందరు కాంగ్రెస్ నేతలున్నారు గానీ.. ఆ వ్యాఖ్యల్ని దేశప్రజలెవరూ హర్షించడంలేదు..' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తమాటలు మాత్రమేకాదు, కొందరు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు కూడా.
ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకి, ఈరోజు చర్చా కార్యక్రమాల్లో కాశ్మీర్ అంశం పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. కొందరు నేతలు కాంగ్రెస్‌ని సమర్థించే క్రమంలో, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు డిస్కషన్స్ ప్యానల్లో ప్రజల నుంచి. మొత్తమ్మీద భారతీయ జనతా పార్టీకి కాశ్మీర్ సమస్యను పరిష్కరించే క్రమంలో రెండు లాభాల్ని పొందింది. అందులో ఒకటి దేశ ప్రజలు బీజేపీపై నమ్మకాన్ని పెంచుకునేలా చేయడం.. ఇంకోటి కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగేలా చేయడం.