చిత్రం: అరణ్య
రేటింగ్: 2/5
నటీనటులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, రఘుబాబు, అనంత్ మహదేవన్, రవి కాలె తదితరులు
సంగీతం: శంతను మోయిత్రా
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
కెమెరా: ఎ.ఆర్.అశోక్ కుమార్
సంభాషణలు: వనమాలి
నిర్మాత: ఎరోస్ ఇంటర్నేషనల్
దర్శకత్వం: ప్రభు సోలొమన్
విడుదల తేదీ: 26 మార్చ్ 2021
కరెంట్ ఎఫైర్స్ ఫాలో అయ్యేవాళ్లకి 'జాదవ్ మొలై పయెంగ్' అనే పెరు చెబితే ఎక్కడో విన్న పేరులా అనిపించొచ్చు. గుర్తుపెట్టుకునే వారికి వెంటనే “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” అనే టైటిల్ గుర్తు రావొచ్చు. అస్సాం కి చెందిన ఈ అటవీ పరిరక్షకుడు కొన్నేళ్ల క్రితం పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. ఈ “అరణ్య” కి స్ఫూర్తి ఆ ఫారెస్ట్ మ్యానే.
ఇక సినిమా విషయానికొస్తే ..టెన్ కామాండ్మెంట్స్ చిత్రంలో మోజెస్ ని పోలిన గెటప్పులో రానా దగ్గుబాటి, ఏనుగుల నేపథ్యంలో అడవిలో జరిగే కథ…మొత్తానికి ఒక కొత్త యాంబియన్స్ అయితే సెట్ అయింది. ప్రచార పరంగా కూడా జనానికి బాగానే రీచ్ అయింది.
ఇంతకీ లోపలున్నదేమిటి? ఎలా ఉంది…వివరాల్లోకి వెళ్దాం.
అరణ్య (రానా దగ్గుబాటి) అటవీ పరిరక్షకుడు. చెట్టు, మొక్క, పక్షి, ఏనుగు ఇలా అడవిలో ఉన్న ప్రతి జీవిని ప్రేమిస్తూ, వాటి భాషను అర్థం చేసుకుంటూ, వాటితో మాట్లాడుతూ అడవిలోనే బతికే వ్యక్తి. అతనికి అప్పటికే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా జాతీయస్థాయి గుర్తింపుంటుంది. చదువుకున్నవాడు..ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు..చూడ్దానికి మాత్రం అడవిబిడ్డలా ఉంటాడు. ఆవేశపరుడు. ఆ అడవిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పాగా వేస్తుంది. అది స్వయంగా ఒక మంత్రి గారి వ్యాపారస్వప్నం. దానివల్ల అడవి పాడవడం, చెట్లు కూలడం, ఏనుగుల జీవనం ప్రశ్నార్థకమవ్వడం వంటి ఉపద్రవాలు తలెత్తుతాయి.
ఆ ప్రాజెక్ట్ కి అరణ్య అడ్డుతగులుతాడు. ఎంత అడ్డు జరుపుకున్నా తగుల్తూనే ఉంటాడు. ఆ అరణ్యని మంత్రి మనుషులు ఏం చేసారు? అరణ్య ఎలా పోరాడాడు? చివరికి ఏం సాధించాడు అనేది కథ.
కథ పరంగా చాలా ప్రెడిక్టిబుల్గా సాగుతుంది. చివరికి ఏమౌతుందో అనే సస్పెన్స్ ఏమీ ఉండదు. క్లైమాక్స్ దాకా కథనం ఎలా ఉందనేదే ప్రశ్న. సమాధానం చెప్పాలంటే అడవిలో ఉన్నన్ని ఎత్తుపల్లాలు, ముళ్లు, చికాకులు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో. అయితే అన్నిటినీ భరించేలా చేసింది మాత్రం రానా నటన. ఒక్క మాటలో చెప్పాలంటే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఈ సినిమాపై “లయన్ కింగ్” ప్రభావం కూడా కాస్త పడింది. ముఖ్యంగా టైటిల్ మ్యూజిక్ విన్నా, దారి చూపించే “జాజు” లాంటి పక్షిని చూసినా “లయన్ కింగ్” గుర్తుకొస్తుంది. అలాగని ఈ చిత్రరాజాన్ని లయన్ కింగ్ తో పోల్చక్కర్లేదు.
ఇందులో ప్రధానలోపం విష్ణు విశాల్ పాత్ర మీద నడిపిన లవ్ ట్రాక్. అది కూడా అరకొరగా, అర్థాంతరంగా ఆపేసిన అరప్రేమకథ. అసలదెందుకు పెట్టారో, ఆ లేడీ నక్సలైట్ పాత్ర దేనికో కూడా అర్థం కాదు. ఇక గిటార్ లాంటి వాయిద్యాన్ని పట్టుకుని ఏనుగు మీద పడుకుని విష్ణు విశాల్ వింటేజ్ లవర్ బాయ్ లా ఫోజు కొడుతుంటే డైరెక్టర్ ని మనసులోనే మొట్టికాయలేయాలనిపిస్తుంది.
ఇంకో మైనస్..రానా క్యారక్టరైజేషన్…ఇంగ్లీషు మాట్లాడుతూ జర్నలిష్టులకి కూడా ఏం చెయ్యాలో చెప్పగల అరణ్య.. కోర్టులోనూ, జైల్లోనూ చాలా సిల్లీగా బిహేవ్ చేస్తూ చిరాకు పెడతాడు. డైరక్టర్ కనీసమైన కామన్ సెన్స్ కూడా వాడకుండా కన్వీనియంట్ గా రొట్టకొట్టుడు సీన్స్ తో నింపేసాడనిపిస్తుంది.
మరో మైనస్ ఏంటంటే ముఖ్యపాత్రల్లో కూడా తెలిసిన మొహాలు లేకపోవడం. పాత్రతో కనెక్ట్ కాకపోయినా ఆర్టిస్టుతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా మేకర్స్ ఇవ్వకపోవడం. అన్ని భాషల ప్రేక్షకుల్నీ హుక్ చెయ్యడానికి భాషకో నటుడిని పెట్టుకోవడం కంటే, కనీసం మూడు రాష్ట్రాలకీ కామన్ గా తెలిసిన నటుల్నైనా పెట్టుకోవచ్చు కదా!! బహుశా ఈ కథ విని పాపులర్ అర్టిస్టులు తెలివిగా మొహం చాటేసి ఉండొచ్చు.
సింఘ పాత్రలో విష్ణు విశాల్ డైరెక్టర్ చెప్పినట్టు చేసి ఒక సీన్లో పెద్ద ఏడుపు ఏడ్చి మాయమయ్యాడు. రఘుబాబుది కామెడీ అనుకోమనే సైడ్ కిక్ పాత్ర. పేరుకి మిగతా పాత్రలు చాలానే ఉన్నా చెప్పుకోదగ్గ విశేషమేమీ లేదు.
సినిమాటోగ్రఫీకి నూటికి తొంభై మార్కులేయొచ్చు…బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు కానీ ఇంకా బాగుండొచ్చు. స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పాలంటే, కొన్ని కీలకమైన సీన్స్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తేలిపోయింది. రానా పడ్డ కష్టం తప్ప చెప్పుకోవడానికేమీ లేని సినిమా ఇది. ఈ సందేశాత్మకచిత్రం ఎక్కువమందికి నచ్చడం సందేహాత్మకమే.
బాటం లైన్: సహనానికి పరీక్ష