ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నూతన సారథిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
ఈ నెలాఖరులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సారథి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా మాజీ సీఎస్ నీలం సాహ్ని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ప్రేంచంద్రారెడ్డి పేర్లను గవర్నర్ పరిశీలనకు జగన్ సర్కార్ పంపింది. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు.
నీలం సాహ్ని సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా, అలాగే శామ్యూల్ నవరత్నాల పర్యవేక్షణ సలహాదారుగా, ప్రేంచంద్రారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఈ ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను పరిశీలించిన గవర్నర్.. చివరికి నీలం సాహ్ని పేరును ఖరారు చేసి ఆమోద ముద్ర వేశారు. దీంతో నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు. పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నూతన సారథి నీలం సాహ్ని ఆధ్వర్యంలో జరగనున్నాయి.