నేత‌లు క‌లిశారు…మ‌రి మ‌న‌సులు?

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య చాలా విచిత్ర‌మైన రీతిలో పొత్తు సాగుతోంది. తెలంగాణ‌లో పొత్తు కుదుర్చుకోకుండానే ఆ రెండు పార్టీలు విడాకులు తీసుకున్న ప‌రిస్థితి. ఏపీలో మాత్రం క‌లిసే ఉన్నామని పైకి చెబుతున్నా… క్షేత్ర‌స్థాయిలో…

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య చాలా విచిత్ర‌మైన రీతిలో పొత్తు సాగుతోంది. తెలంగాణ‌లో పొత్తు కుదుర్చుకోకుండానే ఆ రెండు పార్టీలు విడాకులు తీసుకున్న ప‌రిస్థితి. ఏపీలో మాత్రం క‌లిసే ఉన్నామని పైకి చెబుతున్నా… క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా ఆ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. దీంతో తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక ఆ రెండు పార్టీల మ‌ధ్య విభేదాల‌ను మ‌రింత స్ప‌ష్టంగా క‌ళ్ల‌కు క‌ట్టింది.

ఒక‌వైపు ప్ర‌త్యర్థి పార్టీలు ప్ర‌చారంలో దూసుకుపోతుంటే, బీజేపీ మాత్రం అభ్య‌ర్థి ఎంపిక‌తోనే పుణ్య‌కాలం కాస్త క‌రిగించింద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ సీఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను ఎంపిక చేశారు. త‌న ఎంపిక‌కు స‌హ‌క‌రించిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ర‌త్న‌ప్ర‌భ ట్వీట్ చేస్తూ …ప‌వ‌న్‌కు ట్యాగ్ చేసినా స్పందించ‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అస‌లు జ‌న‌సేన వైఖ‌రి ఏంట‌నే అనుమానాలు, ప్ర‌శ్న‌లు పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌తో పాటు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి పురందేశ్వ‌రి, ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు, ఏపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల కోఇన్‌చార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్‌, బీజేపీ రాష్ట్ర జ‌నర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌ధుక‌ర్ క‌లిశారు. ఈ భేటీలో ప‌వ‌న్‌తో పాటు జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ పాల్గొన్నారు.

ప్ర‌స్తుతానికి బీజేపీ-జ‌న‌సేన అగ్ర‌నేత‌లు క‌ల‌వ‌డంతో విభేదాల ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్టైంది. అయితే బీజేపీ -జ‌న‌సేన నేత‌లు క‌లిసినంత మాత్రాన‌, వారి మ‌న‌సుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న త‌లెత్తింది. ఎందుకంటే మ‌నుషులు క‌లిసినంత ఈజీ కాదు మ‌న‌సులు క‌ల‌వ‌డం. 

బీజేపీ, జన‌సేన నేత‌లు అవున‌న్నా , కాద‌న్నా ఇరువైపులా “అహం” వాటి బ‌లోపేతానికి అడ్డంకిగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో ఇరు పార్టీల నాయ‌కుల క‌ల‌యిక‌తో క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ క‌లిసి ఉప ఎన్నిక‌లో ప‌ని చేస్తుందా? అనేది తాజా అనుమానం.

మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేనాని ప్ర‌చారం చేస్తే అంతోఇంతో బీజేపీ అభ్య‌ర్థికి క‌లిసి వ‌స్తుంది. అలా కాకుండా కేవ‌లం నోటి మాట‌తో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ భేటీలో ఉప ఎన్నిక‌లో అనుస‌రించాల్సిన వైఖ‌రిపై చ‌ర్చించార‌నే స‌మాచారం వ‌స్తోంది. రానున్న రోజుల్లో రెండు పార్టీలు క‌లిసి ముందుకు సాగే దానిపై తాజా భేటీలోని చిత్త‌శుద్ధి ఏపాటిదో తెలియ‌జేస్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.