గాడ్ ఫాదర్ కు ఆచార్య నేర్పిన పాఠాలు

పోయిన ఆస్తి పోతే పోయింది కానీ కోర్టు పద్దతులు తెలిసాయి అన్నది సామెత. ఆచార్య సినిమా ఫెయిల్ అయితే అయింది కానీ సినిమాను ఎలా మార్కెట్ చేయకూడదో, ఎలా విడుదల చేయాలో తెలిసి వచ్చింది…

పోయిన ఆస్తి పోతే పోయింది కానీ కోర్టు పద్దతులు తెలిసాయి అన్నది సామెత. ఆచార్య సినిమా ఫెయిల్ అయితే అయింది కానీ సినిమాను ఎలా మార్కెట్ చేయకూడదో, ఎలా విడుదల చేయాలో తెలిసి వచ్చింది మెగాస్టార్ టీమ్ కు. ఆచార్య సినిమా భారీ రేట్లకు అమ్మడం, బయ్యర్లు అంతా వచ్చి తన నష్టాలు భర్తీ చేయాలని దర్శకుడి ఆఫీసు మీదకు వచ్చి కూర్చొవడం ఇలాంటివి చాలా జరిగాయి. మెగాస్టార్ పేరు ఎంత డ్యామేజ్ కావాలో అంతా అయింది. దీని వల్ల నేర్చుకున్న పాఠాల గాడ్ ఫాదర్ కు ఉపయోగపడ్డాయి. బోలెడు జాగ్రత్తలు తీసుకుని గాడ్ ఫాదర్ ను విడుదలచేసారు.

అన్నింటి కన్నా ముందుగా తీసుకున్న జాగ్రత్త ఏమిటంటే సినిమాను విక్రయించకపోవడం. ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కేవలం అడ్వాన్స్ ల మీదనే విడుదల చేసారు. అది కూడా వీలయినంత రీజనబుల్ గా అడ్వాన్స్ లు తీసుకున్నారు. ఇక్కడ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ధైర్యం ఒక్కటే. పంపిణీ దారులంతా తన మిత్రులే. ఓవర్ ఫ్లోస్ పక్కాగా వస్తాయనే నమ్మకం. అందుకే ఎవరు ఎంత పంపితే అంతకే సినిమా ఇచ్చి విడుదల చేసారు.

నిజానికి సినిమా విడుదల నాటికి వచ్చిన అడ్వాన్స్ లకు, నిర్మాణానికి చేసిన ఖర్చుకు పొంతన లేదు. అయినా అలాగే విడుదల చేసారు. డెఫిసిట్ ను భరించి. ఎందుకంటే నాన్ థియేటర్ డబ్బులు కూడా ఇంకా రాలేదు కనుక.

రెండో పాయింట్ ఏమిటంటే ఇష్టం వచ్చినట్లు భారీగా థియేటర్లు పరిచేయకుండా వుండడం. ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తే మొదటి రోజు భారీ షేర్ కనిపిస్తుంది కానీ రన్ విషయంలో సమస్య వస్తుంది. కొన్ని థియేటర్లు ఖాళీగా వుండి ట్రోలింగ్ మొదలవుతుంది. అందుకే చాలా లిమిటెడ్ గా థియేటర్లు వేసారు. దాని వల్ల మొదటి రోజు ఫుల్స్ ఫుల్ గా కనిపించాయి. కానీ ఓపెనింగ్ ఫిగర్ తక్కువ పడింది. అయినా వచ్చిన నష్టం లేదు.

మొత్తం మీద ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుని విడుదల చేసిన గాడ్ ఫాదర్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది సోమవారం క్లారిటీ వస్తుంది.