మహాభళేశ్వర్ పర్వతాల్లో ఒకేరోజు ఏకంగా 38 సెంటీమీటర్ల స్థాయి వర్షపాతం నమోదైందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. దీనితో కృష్ణానది మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతో ఇప్పటికే ఆ ప్రాజెక్టులో స్టోర్ అయిన వాటర్ ను దిగువకు వదులుతూ ఉన్నారు.
ఇప్పటికే నారాయణ్ పూర్ జలాశయం గరిష్ట పరిమితికి చేరుకోవడంతో అక్కడ నుంచి కూడా దిగువకు నీరు వదులుతున్నారు. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత భారీ వరద నీరు చేరుతూ ఉంది. రోజుకు దాదాపు ఇరవై టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతూ ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే దాదాపు 120 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి చేరాయి. దీంతో మరో నాలుగు రోజులు ఇదేస్థాయి వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టాన్ని చేరే అవకాశం ఉంది. కాస్త ఆలస్యంగా అయినా శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడం సంతోషదాయకమైన విషయం.
ఇప్పటికే హంద్రీనీవా కాలువలు కొన్ని నెలలుగా ప్రవాహం లేక కళతప్పాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో హంద్రీనీవా పరిస్థితి ఆశాజనకంగా మారుతూ ఉంది.