ఇది ప్రతిపక్షాల కుట్ర కాదు జగన్..!

కొన్నిపనులు టైమ్ కి జరిగిపోతేనే వాటికి విలువ. సమయం మించిపోతే.. అంతకంటే బాగా చేసినా ఎవరూ గుర్తించరు. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. గతనెల వైఎస్సార్ జయంతి సందర్భంగా పింఛన్…

కొన్నిపనులు టైమ్ కి జరిగిపోతేనే వాటికి విలువ. సమయం మించిపోతే.. అంతకంటే బాగా చేసినా ఎవరూ గుర్తించరు. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. గతనెల వైఎస్సార్ జయంతి సందర్భంగా పింఛన్ ని పెంచి ఆలస్యంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. తీరా ఈనెల కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. ఐదు మారి ఆరోతేదీ వచ్చినా రాష్ట్రంలో ఇంకా పింఛన్ల పంపిణీ పూర్తికాలేదు.

అధికారుల నిర్లక్ష్యమా లేక కిందిస్థాయి సిబ్బంది అలసత్వమా తెలియదు కానీ.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నాలుగు రోజులుగా పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్నారు. ఇక వాళ్లని టీడీపీ రెచ్చగొట్టకుండా ఉంటుందా? పింఛన్ పంపిణీ చేసే కేంద్రాలకు వెళ్లి బ్యానర్లు పట్టుకుని అసంతృప్తితో ఉన్నవారితో జగన్ ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. అసలే విడతల వారీ పెంపుతో పింఛన్ దారులు అసంతృప్తితో ఉన్నారు. దీనికి మరింత ఆజ్యం పోస్తోంది టీడీపీ.

చంద్రబాబు టైమ్ లో ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు వారం అవుతున్నా ఇంకా చేతికి డబ్బులందడంలేదని అంటున్నారు. నిజంగానే చంద్రబాబు టైమ్ లో ఒకటో తేదీనే పింఛన్ వచ్చేదా అంటే కాదనే చెప్పాలి. లేటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు లెక్కలోకి రావు, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఇలాగేనా మీరు చేసేది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయనే విషయాన్ని కాదనలేం. అంత మాత్రాన అదంతా ప్రతిపక్షాల కుట్ర అనుకుంటే ఎలా? “సాక్షి” కూడా కేవలం దీన్ని ప్రతిపక్షాల రాద్ధాంతంగా చెప్పుకొస్తుంది కానీ, ఎక్కడా అధికారుల అలసత్వాన్ని బైటపెట్టడం లేదు. ఇక్కడ ప్రతిపక్షాల రాద్దాతం కంటే అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది.

సమస్యపై ఫోకస్ పెడితేనే దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది కానీ, ప్రతిదాన్నీ ప్రతిపక్షంపై నెడితే ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉంది. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మంత్రులు చురుగ్గా స్పందించి వ్యవహారాన్ని సెటిల్ చేస్తే బాగుంటుంది. అన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటారు, మనకెందుకులే అనుకుంటే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు. 

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్