ఉన్నట్టుండి నోట్ల రద్దు అనగానే.. సోషల్ మీడియా ఊగిపోయింది! మోడీ చాలా గొప్ప పని చేశారని, నల్లధనికుల ఆట కట్టించారని, ఆ దెబ్బతో దేశంలోని నల్లధనం మొత్తం బయటకు వచ్చేస్తుందని, అది దేశానికి ఎంతో మేలు చేసే చర్య అని.. ఇలా సోషల్ మీడియాలో నెటిజన్లు ఊగిపోయారు!
మోడీ తీసుకున్న చర్య అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అని.. బోలెడంత మంది ఎగిరి గంతులేశారు! అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. నోట్లరద్దు ఎలాంటి చర్యనో ఎవరికి వారికి అర్థం అయ్యింది. నోట్లరద్దుతో ఎంతమంది నల్లధనికులు దొరికారో, అది దేశానికి ఎంత ఉపయుక్తంగా నిలిచిందో.. ఆ తర్వాత మోడీ ప్రభుత్వమే బహిర్గతం చేసింది. నోట్లరద్దు వల్ల ఖజానాపై భారం, చిన్న వ్యాపారులు దెబ్బతినడం, సామాన్యులు ఇక్కట్ల పాలవ్వడమే తప్ప ఏం ఒరిగిందో దేశానికి తెలిసిందే. మూఢభక్తులు ఒప్పుకోరు అనుకోండి!
ఇక నోట్లరద్దు తర్వాత జీఎస్టీని ముందుగానే ప్రకటించారు. ఒక అర్ధరాత్రి ముహూర్తంతో దాన్ని అమలు చేశారు. అప్పుడు కూడా దేశానికి స్వతంత్రం వచ్చిందని ప్రకటించారు. ఆ తర్వాత జీఎస్టీపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. వ్యాపార వర్గాల్లో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జీఎస్టీతో స్వతంత్రం వచ్చిందని ప్రకటించిన మోడీ సర్కారే జీఎస్టీలో రకరకాల మార్పులు చేస్తూపోతోంది.
ఇలానే ఉంది కశ్మీర్ కు కొత్త చట్టం కూడా. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో కొంతమంది ఊగిపోతూ ఉన్నారు. కశ్మీర్లో ఇక ఆస్తులు కొనొచ్చట! తమ జన్మలో ఎప్పుడూ ఏపీని దాటని వారు కూడా కశ్మీర్ లో తమకు స్వతంత్రం వచ్చిందని ఊగిపోతూ ఉన్నారు.
తమ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను కేంద్రం తీసుకుంటే వీళ్లు సహించలేరు. ఉత్తరభారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ మాట్లాడతారు. ఉత్తరాధిని దక్షిణాది పోషిస్తోందంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లంతా కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం ఊగిపోతూ ఉన్నారు. మనుషుల్లోని ద్వంద్వ వైఖరి ప్రతి విషయంలోనూ ఉంటుంది. దానికి ఈ వ్యవహారం కూడా మినహాయింపు కాదు.
మరి మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇది వరకూ మొదట్లో ఊపేశాయి. తర్వాత వికటించాయి. ఇది గత ఐదేళ్ల పాలన చెబుతున్న సత్యం. మరి కశ్మీర్ విషయంలో ఏమవుతుంది? అనేది ప్రస్తుతానికి మిస్టరీనే. దేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్లుగా ఈ నిర్ణయం వికటించకూడదని, కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, నిర్ణయాలు ఎవరివైనా, ఏవైనా మంచు రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, ఇదో హిమాలయన్ బ్లండర్ కాకూడదని ఆశిద్దాం.