తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా రూపు మారింది. మనదేశంలో సరికొత్త జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఇప్పుడే పుట్టిన జాతీయ పార్టీలాగా.. నిదానంగా అడుగులు వేసి నిలదొక్కుకునే దశకు చేరుకోవాలని ఈ భారత్ రాష్ట్ర సమితి ఆశించడం లేదు. ఉన్నపళంగా దేశవ్యాప్తంగా తమ అస్తిత్వాన్ని కలిగి ఉన్న పెద్ద పార్టీగా అవతరించడానికి తగిన సన్నాహాలు చేసుకుంటూ ఉంది. ఈ మేరకు బి ఆర్ ఎస్ పార్టీ కీలక వ్యూహకర్తలు, రాజకీయ చాణక్యులు అందరూ ఒక్కసారిగా రంగంలోకి దిగారు.
దేశంలో చెదురు మదురుగా ఉన్న అనేకానేక చిన్న పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడానికి బేరసారాలు ప్రారంభించారు. చిన్నచిన్న ప్రాంతీయ పార్టీలు వారికి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల బలాన్ని బట్టి వారికి ప్రాధాన్యమిస్తూ వారికి తగిన ఆఫర్లతో బిఆర్ఎస్ లో చేర్చుకోవడానికి మంతనాలు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిర్భవించి భారత్ రాష్ట్ర సమితిగా ఇవాళ పురుడు పోసుకుని ఉండవచ్చు గాక! కానీ అప్పుడే ఆ పార్టీకి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో అస్తిత్వం నిరూపణ అయింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకుల స్వయంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రకటన సమావేశానికి వచ్చి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కుమారస్వామి తో చాలా కీలకమైన పొత్తులనే కెసిఆర్ కుదుర్చుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది! కుమారస్వామి సమక్షంలోని కర్ణాటకలో బి ఆర్ ఎస్ జెండా ఎగరాలి అని కేసిఆర్ పిలుపు ఇవ్వడం గమనార్హం. విడతలు విడతలుగా పలుమార్లు హైదరాబాదుకు వచ్చి కేసీఆర్ తో మాట్లాడి వెళ్లిన కుమారస్వామి- కెసిఆర్ పొత్తులు ఏ రూపంలో ఉండబోతున్నాయో కొంచెం వేచి చూడాలి.
తమిళనాడులో బి ఆర్ ఎస్ పరిస్థితి ఇంకా సాఫీగా స్థిరపడింది. ఆ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును కలిగి ఉన్న వీసీకే అనే పార్టీ బిఆర్ఎస్ లో విలీనం అయినట్లే. తమిళనాడు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీతో పొత్తులు కుదుర్చుకుని తమకు లభించిన ఎంపీ సీటును దక్కించుకున్న వీసీకే పార్టీ ఇప్పుడు కేసీఆర్ పార్టీలో విలీనం కాబోతోంది. ఆ పార్టీ తరఫున చిదంబరం స్థానం నుంచి ఎంపీగా గెలిచిన తిరుమవలవన్ బుధవారం నాటి సభకు హాజరయ్యారు. బి ఆర్ ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత సదరు బీసీకే పార్టీ విలీనం కావడం అనే లాంఛనం పూర్తవుతుంది.
ఈ పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా దేశంలో ఇతర ప్రాంతాలలో చలామణిలో ఉన్న చిన్నచితకా పార్టీలకు కేసీఆర్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. విలీనానికి సిద్ధమైతే ఎవరి స్థాయికి తగిన ఆఫర్లు వారికి ఉండనే ఉంటాయి. చిన్న పార్టీలకు కూడా భారీ ఆఫర్లతో బేరసారాలతో ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తానికి జాతీయ పార్టీగా ఈసీ నుంచి అధికారిక గుర్తింపు వచ్చిన వెంటనే చిన్న పార్టీలు విలీనం కావడం అనే ప్రక్రియను టాప్ గేర్ లో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. దేశమంతా గులాబీ జెండా ఉండేలా కేసీఆర్ దళం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.