జమ్మూకాశ్మీర్ కు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అందుకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విభజిస్తారు. కొత్తగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి 114 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నది ఏంటంటే… దానితో పాటూ అయిదేళ్లుగా పెండింగ్ లో ఉన్న మన తెలుగురాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా చోటు చేసుకుంటుందా? లేదా అని! తెలుగు ప్రజలు దీనికోసం ఎదురుచూస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం ఇలా విభజించిందో లేదో.. అప్పుడే శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైపోయినట్లుగానే కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన కమిషన్ ఏర్పాటుచేయబోతున్నారు. మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో 87 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో లడాఖ్ ప్రాంతంలో ఉన్న నాలుగు నియోజకవర్గాల గురించి మరచిపోవాల్సిందే ఎందుకంటే, దానిని అసెంబ్లీ ఉండని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో మిగిలిన 83 స్థానాలను పునర్విభజించి.. 114 అసెంబ్లీ సీట్లుగా మార్చబోతున్నారు.
మొన్నటిదాకా కశ్మీర్ ప్రాంతంలో 46, జమ్మూలో 37 సీట్లు ఉన్నాయి. వీటి పునర్విభజనకు అప్పుడే కేంద్రం పావులు కదుపుతోంది. వాస్తవానికి 2026 వరకు పునర్విభజన జరిగే చాన్సులేదు. అప్పటిదాకా ఎంపీ సీట్లు పునర్విభజించకుండా పార్లమెంటు గతంలో చట్టం చేసింది. కానీ, ఇప్పుడు ఈ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఉన్నందున, అందుకు అనుగుణంగా కమిషన్ వేస్తారు. అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది.
ఏపీ విభజన చట్టంలో చాలా స్పష్టంగా సీట్ల పెంపు గురించి పేర్కొన్నారు. అయితే కేంద్రం దాని గురించి పట్టించుకోలేదు. గతంలో చంద్రబాబు, కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలం దక్కలేదు. చివరికి 2021లోగా ఆ ప్రక్రియ పూర్తిచేస్తారని వార్తలు వచ్చాయి. ఒక సందర్భంలో సుజనాచౌదరి సభలో లేవనెత్తినప్పుడు.. మంత్రి హన్స్ రాజ్ 2026 వరకు కూడా కుదరదనే చెప్పారు.
కానీ ఒక కమిషన్ ఏర్పాటుచేసి, జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ సీట్లు పెంచనున్న ప్రస్తుత నేపథ్యంలో… ఇక్కడి నాయకులు పూనుకుని అడిగితే గనుక.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.