బిగ్ బాస్ హౌజ్ లో గొడవలు కామన్. కానీ అందులో కూడా ఒక రకమైన హుందాతనం ఉండేది. హద్దులు దాటినా ఫర్వాలేదు అనిపించేది. రచ్చ జరిగినా వినోదం కనిపించేది. కానీ ఎప్పుడైతే తమన్న సింహాద్రి ఎంటర్ అయిందో అప్పట్నుంచి బిగ్ బాస్ హౌజ్ స్వరూపమే మారిపోయింది. మొన్నటివరకు వివాదాలకే పరిమితమైన హౌజ్, తమన్న రాకతో అసహ్యంగా తయారైంది. ఛీ.. ఇదేం కార్యక్రమం అంటూ ప్రేక్షకులు ఏవగించుకునేలా మారింది.
నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా తమన్న మాటలకు హౌజ్ లో సభ్యులంతా నోరెళ్లబెట్టారు. ఆమెతో వాదనకు దిగడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపంచలేదు. తమన్న నోట్లో నోరు పెట్టడం ఎందుకనే ఆలోచన ధోరణి సభ్యులందరి ముఖాల్లో కనిపించింది. ఉన్నంతలో పునర్నవి జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో తమన్న తిట్లపురాణం కాస్త తగ్గింది. ప్రేక్షకులకు కొంత ఉపశమనం దక్కింది.
హౌజ్ లో ఏది జరిగినా అల్టిమేట్ గా అది వీకెండ్ వచ్చే నాగార్జునకే చుట్టుకుంటుందనే విషయం తెలిసిందే. ఈసారి ఆ రచ్చ కాస్త తొందరగానే ప్రారంభమైంది. తమన్న లాంటి వ్యక్తి హౌజ్ లోకి వచ్చిందంటే నాగార్జున అంగీకారం లేకుండా జరగదని, ఇలాంటి విషయాల్లో నాగార్జున మరింత జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో సలహాలు వరదలా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమన్న వాగుడుతో హౌజ్ లో సభ్యుల సంగతేమో కానీ, నాగ్ పరువు మాత్రం పోతుందని అంటున్నారు.
తాజా వాగుడుతో వచ్చిన కొన్ని రోజులకే తమన్న ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యవహారశైలితో సభ్యులు ఇమడలేకపోతున్నారు. నాగ్ సీన్ లోకి రావడానికి ఇంకా 4 రోజులు టైమ్ ఉంది. ఈ 4 రోజుల్లో తమన్న ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.