వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని షర్మిల విలీనం చేస్తారనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతంగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకురాలిగా వైఎస్ షర్మిల సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా? అనే ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. కర్నాటక మంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.
కాంగ్రెస్‌తో డీకే శివకుమార్ చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇటీవల షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో తన పార్టీ విలీనం, అలాగే జాతీయ పార్టీలో తన పాత్రపై చర్చించారు. కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చల అనంతరం ఆమె సంతృప్తి చెందారు. ఇక కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే తరువాయి.
ఈ నెల 22న కాంగ్రెస్ కండువాను షర్మిల కప్పుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ వాతావరణంలో పెరిగారు. కాంగ్రెస్ నాయకుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా వైఎస్సార్ పేరు పొందారు. సోనియాగాంధీ ఆశీస్సులతో 2004లో వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండోసారి కూడా 2009లో ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు, కేంద్రంలో రెండో సారి యూపీఏ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడానికి వైఎస్సార్ నాయకత్వమే కారణం.
ఇదిలా వుండగా వైఎస్సార్ మరణానంతరం ఓదార్పు యాత్ర చేపట్టడాన్ని సోనియాగాంధీ వ్యతిరేకించడంతో, అందుకు నిరసనగా కాంగ్రెస్‌ను వైఎస్సార్ కుటుంబం వీడింది. అన్న కోసం షర్మిల వైసీపీ కోసం పని చేశారు. ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర కూడా ఆమె చేపట్టారు.
జగన్‌తో విభేదాల నేపథ్యంలో ఆమె తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అయితే షర్మిల నేతృత్వం వహిస్తున్న వైఎస్సార్టీపీకి తగిన ఆదరణ లేకపోవడం, కేసీఆర్ సర్కార్ నుంచి అడ్డంకులు ఎదురవుతుండడంతో ఆమె చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. కర్నాటక మంత్రి డీకే శివకుమార్ జోక్యంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగుమమైంది. ఈ నెల 22 నుంచి కాంగ్రెస్ నాయకురాలిగా షర్మిల కొత్త పొలిటికల్ గెటప్‌లో కనిపించనున్నారు.