పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటానని టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ అంటున్నారు. గత ఎన్నికల్లో లోకేశ్ మంత్రి హోదాలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలో దిగిన సంగతి తెలిసిందే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ ఓడిపోయారు. మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికల్లోనే నాటి సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి అయిన లోకేశ్ ఓడిపోవడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
ఈ దఫా అయినా లోకేశ్‌కు సురక్షిత అసెంబ్లీ సీటు చూడాలని టీడీపీ అధిష్టానం అనుకుంటోంది. అయితే ఓడిపోయిన చోటే గెలిచి టీడీపీకి గిఫ్ట్ ఇస్తానని లోకేశ్ ధీమాగా చెబుతున్నారు. నిజానికి మంగళగిరి అనేది టీడీపీ సీటు కానే కాదు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, వైసీపీకి బలమైన పట్టు ఉంది. ఆ నియోజకవర్గంలో చేనేతలు గెలుపోటములను ప్రభావం చేస్తారు. అందుకే అక్కడి చేనేత నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు.
ఒకరికి ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు, అలాగే మరో నాయకుడు గంజి చిరంజీవికి చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. ఈ ఇద్దరి నాయకులతో పాటు చేనేతలకు అత్యధికంగా సాయం చేస్తుండడంతో వారి ఆదరణ పొంది, ముచ్చటగా మూడోసారి మంగళగిరి నుంచి వైసీపీ జెండా ఎగురేయవచ్చని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. కానీ రాజధాని మార్పు, అలాగే ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటోందని, కావున ఎలాగైనా ఈ సారి గెలుస్తానని లోకేశ్ ధీమాగా వున్నారు.
ఇవాళ ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇక్కడే పోటీ చేస్తానని, భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. అభివృద్ధే చేయని వైసీపీని జనం ఆదరించరన్నారు.