మైకు కనపడితే చాలు మాటకు ముందు మాటకు తర్వాత తోలు తీస్తా.. కాళ్ళు విరగగొడతా.. మోడీకి చెప్పి మీ పని పడతా అంటూ వార్నింగ్‌లు ఇచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కనీసం నారా లోకేష్ ఉన్నంత ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేస్తున్నారు పవన్ ప్రత్యర్థి పార్టీలు.
గతంలో తాను ఓడిపోయిన మంగళగిరిలో పాదయాత్ర మొదలైనప్పుడు నుంచి నేను ఇక్కడి నుంచి నిలబడతాను.. నన్ను గెలిపించండి.. నన్ను గెలిపిస్తే మీకు ఇది చేస్తా అది చేస్తానంటూ నారా లోకేష్ ప్రజలతో చెప్పుకుంటున్నారు. కానీ గతంలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ బస్సు యాత్రలో ఆ రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన నేను ఇక్కడ నిలబడతాను.. నన్ను గెలిపించండి అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఆ నియోజకవర్గాల్లోని ప్రజలను మాత్రం నన్ను ఓడించి పెద్ద తప్పు చేశారని.. గెలిపించింటే ప్రశ్నించే వాడిని అంటూ గొప్పలు మాత్రం చెప్పకున్నారు.
తాను ఓడిపోయిన చోటే మళ్లీ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నారా లోకేష్ డేరింగ్ ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుకబడి పోయారు. ఈసారి నేను అసెంబ్లీకి అడుగు పెడతాను ఎవరు ఆపుతారు చూస్తా అంటూ చెప్పిన ఆయన ఎన్నికలకు నెలల వ్యవధే ఉన్న తాను ఫలాన చోట నిలబడితే గెలుస్తానని నమ్మకం మాత్రం రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ నిలబడకుండా 2014లో లాగా టీడీపీకి ఏమైనా సేవా చేస్తారా అంటూ ప్రశ్నలు లేవదీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
పోటీ చేయలనుకుంటే నిలబడే స్థానం గురించి పవన్‌కు ఎందుకు భయం ఉందో ఆయనకే తెలియాలి. నారా లోకేష్‌కు లేని భయం పవన్‌కు ఎందుకని జనసైనికులు సైతం ప్రశ్నిస్తున్నారు. ముందే ప్రకటిస్తే ఆ నియోజకవర్గంలో జరిగే రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకోని పవన్ వెనకడుగు వేస్తున్నారు. కాకపోతే ముందే చెప్పడం వల్ల పవన్‌కు జరిగే నష్టం కంటే లాభమే ఎక్కవగా ఉంటుందని భావిస్తున్నారు జనసేన నాయకులు. ఇప్పటికైనా లోకేష్‌లాగా ధైర్యం చేసి తను నిలబడే స్థానం ప్రకటించాలని జనసైనికులు కోరుతున్నారు.