సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీనే జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ప్రత్యర్థి పార్టీ నాయకుడు ప్రశంసలు కురిపిస్తే ఆ కిక్కే వేరు. జనసేనాని పవన్‌కల్యాణ్, జగన్ మధ్య పచ్చగడ్డి వేస్తే రాజకీయంగా భగ్గుమనే పరిస్థితి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే జగన్ పాలన ఏ మాత్రం బాగా లేదని, అసలు ఆయన్ని సీఎంగా గుర్తించడం లేదని పవన్‌కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కామెంట్స్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి.
జనసేనలో మరో కీలక నాయకుడు నాగబాబు. ఈయన పవన్‌కల్యాణ్ సొంత అన్న. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కోరిక మేరకు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన, అధ్యయనంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడిస్తుంటారు. ఒక్కోసారి అవి వివాదాస్పదమవుతుంటాయి.
తాజాగా ఆయన ఓ ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మనుషుల్లో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. అలాగే భూమి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. “మనిషి ఒక్కడి కోసమే కాదు ఈ భూమి ఉండేది. మనిషి కేంద్రంగా భూమి లేదు. మనిషి కోసం భూమి సృష్టించలేదు. ఈ భూమ్మీద కోట్లాది జీవరాశుల్లో మనిషి ఒక్కడు” అని నాగబాబు ఎంతో ఆవేదనతో తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇక రాజకీయాల విషయానికి వస్తే కూడా తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇటీవల చిరంజీవి గారిని చూస్తుంటే వైసీపీకి దగ్గరవుతున్నట్టున్నారనే యాంకర్ ప్రశ్నకు నాగబాబు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. నాగబాబు ఏమన్నారంటే…
“జగన్ గారు ప్రత్యర్థి పార్టీ అయినంత మాత్రాన ప్రతి సారి ఎదుటి వారిని విమర్శించాలనే చెత్త ఆలోచన రెగ్యులర్ రాజకీయ మానసిక మనస్తత్వం నాకైతే లేదు. జగన్ గారు చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. వైద్యం, ఆరోగ్యశ్రీకి సంబంధించి, పోలీసులకు సెలవులు ఇవ్వడం లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఆయన ఇంకా బాగా చేయగలరు. అంటే చేసింది తక్కువ. చేయనిది ఎక్కువ. కానీ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం వైసీపీని, టీడీపీని కచ్చితంగా వ్యతిరేకిస్తాం” అని నాగబాబు జగన్‌పై ప్రశంసలు కురిపించారు.
ఒక వైపు పవన్‌కల్యాణ్, జనసేన నాయకులు మాత్రం జగన్ సర్కార్ ఏమీ చేయలేదని విమర్శిస్తుంటే, అందుకు విరుద్ధంగా నాగబాబు మాత్రం జగన్ కొన్ని మంచిపనులు చేశారని, ఇంకా బాగా చేయడగలరని నమ్మకంగా చెబుతున్నారు. నాగబాబు అభిప్రాయాలను జనసేన ఎలా స్వీకరిస్తుందో చూడాలి మరి. మొత్తానికి నాగబాబు అభిప్రాయాలు మాత్రం వైసీపీ సర్కార్‌కు జోష్ ఇచ్చేవని చెప్పొచ్చు.
-సొదుం